టాలీవుడ్ నిర్మాతల్లో దిల్‌రాజ్ అంటే ఓ బ్రాండ్. కాలంతో పాటు తాను మారుతూ చిత్ర పరిశ్రమలోని వ్యాపార రంగంలో ముందు వరుసలో ఉంటున్నాడు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నతరుణంలో చిత్ర పరిశ్రమలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు ఉన్న టెక్నాలజీ రేపటికి పాతబడిపోతున్నదంటే అతిశయోక్తి కాదు. అంతలా మార్పులు శరవేగంతో జరిగిపోతున్నాయి.
ప్రపంచం డిజిటల్ మయమైపోతోంది. థియేటర్‌కు వచ్చి సినిమా చూసేవాళ్ల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఒకప్పుడు మంచి సినిమా అంటే వందరోజుల పైమాటే. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత మంచి సినిమా అయినా 50 రోజులు ఆడితే మహాగొప్ప. అందుకే ఇప్పుడు శతదినోత్సవ వేడుకలు జరుపుకునే సినిమానే లేదు.
సినిమా అయినా, క్రికెట్ అయినా, మరొకటి…మరొకటి…ఏదైనా వెంటనే ఆన్‌లైన్‌లో చూసుకుంటున్న పరిస్థితి. భవిష్యత్ అంతా డిజిటల్ మయమే అని గుర్తించిన వాళ్లు ఆ బాట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ కొందరు అదే బాటలో నడుస్తున్నారు కూడా. దేశంలో ఇప్పటికే అమేజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్ తదితర డిజిటల్ వేదికల ద్వారా మంచి సినిమాలు విడుదల అవుతున్నాయి. అలాగే డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో విడుదలవుతున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా లభిస్తోంది. మున్ముందు మరింత ఆదరణ పెరిగే అవకాశాన్ని చిత్ర పరిశ్రమ పెద్దలు గుర్తించారు.
ఇందులో భాగంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ OTT అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రారంభించడానికి సిద్ధమయ్యాడు. ఎటూ తమ ఇంట్లోనే కావాల్సినంత మంది మెగా హీరోలు ఉండనే ఉన్నారు. దీంతో ఆయన తమ హీరోలందరి సినిమాలు ఇందులోనే విడుదల చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అలాగే మిగిలిన వాళ్ల సినిమాలను కూడా కొని విడుదల చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారని సమాచారం. OTT ద్వారా ప్రతి సినిమా నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది. అలాగే ఏడాది పాటు సబ్‌స్క్రైబ్ ఉంటుంది.
టాలీవుడ్ నిర్మాతల్లో దిల్‌రాజ్ గురించి మాట్లాడకుండా ఉండలేం. టాలీవుడ్‌లో లాభాలు తీస్తున్న నిర్మాతల్లో ఆయన అగ్రగణ్యుడు. అరవింద్ బాటలో ఈయన కూడా నడిచేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. డిజిటల్ ప్లాట్ ఫామ్‌ను ఏర్పాటు చేసే క్రమంలో మిత్రులతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. చిత్రపరిశ్రమలో సినిమా నుంచి లాభాలు ఎలా రాబట్టాలో బాగా తెలిసిన దిల్‌రాజ్…డిజిటల్ వ్యవస్థను ఎలా ఉపయోగించుకుంటే విజయం సాధించవచ్చో స్టడీ చేస్తున్నాడని తెలిసింది. త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు విషయం కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. డిజిటల్ ప్రపంచంలో ఎవరూ తోపు కాదని దిల్‌రాజ్ అంటున్నాడు.