రోడ్డెక్కితే మనిషిని కాదు, మైక్ పుచ్చుకుంటే మనిషిని కాదు అనే రకం పవన్. మొత్తానికి చాన్నాళ్ల అజ్ఞాతవాసం తర్వాత మరోసారి మైక్ అందుకున్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. పవన్ వ్యాఖ్యలతో టాలీవుడ్ తలపట్టుకొంది.
కొంతమంది పవన్ వ్యాఖ్యల్ని బాహాటంగా ఖండించేందుకు కూడా రెడీ అవుతున్నారు. మరి ఇంత గొంతు చించుకున్నది టాలీవుడ్ కోసమే, పరిశ్రమ బాగు కోసమే అని బట్టలు చించుకున్న పవన్ కల్యాణ్ కు ఇండస్ట్రీ నుంచి ఎంత మద్దతు దక్కింది? పవన్ కల్యాణ్ కు సపోర్ట్ గా ఎంతమంది నిలిచారు..?
ఎందుకొచ్చిన తలనొప్పి..?
ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ వ్యాఖ్యలపై టాలీవుడ్ నుంచి రియాక్షన్ ఇది. “ఆయనేదో ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీని, మంత్రుల్ని తిట్టాడు. మనమెందుకు రియాక్ట్ అవ్వడం” అనే భావనలో టాలీవుడ్ నటీనటులు పెద్దలు గమ్మున ఉండిపోయారు.
నిజానికి పవన్ లాంటి స్టార్ హీరోకు సపోర్ట్ ఇవ్వడానికి ఇండస్ట్రీ పెద్దలకు పెద్దగా అభ్యంతరం ఉండదు, పైపెచ్చు రియాక్ట్ అవ్వడానికి ఎగబడే జనాలు కూడా ఉన్నారు. కానీ ఈసారి అలా జరగలేదు. నాని తప్ప ఇప్పటివరకు మరో హీరో పవన్ కు మద్దతుగా మాట్లాడలేదు. నాని కూడా పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయలేదు. పాము చావకుండా, కర్ర విరగకుండా ముక్తాయింపు ఇచ్చాడంతే.
చిరంజీవికి, పవన్ కు అదే తేడా!
గతంలో చిరంజీవి చేసిన విజ్ఞప్తిపై టాలీవుడ్ జనాలు ఎగబడి స్పందనలు తెలియజేశారు. కానీ ఇప్పుడు పవన్ మాటలకు మాత్రం పెద్దగా స్పందన రాలేదు. దీనికి కారణం కేవలం మాటతీరు మాత్రమే. మాటతీరులో పవన్ కు చిరంజీవికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
గమ్మత్తైన విషయం ఏంటంటే.. కొన్ని రోజుల కిందట చిరంజీవి ప్రభుత్వానికి ఏ విజ్ఞప్తులైతే చేశారో.. యాజ్ ఇటీజ్ గా అవే విజ్ఞప్తుల్ని పవన్ కల్యాణ్ కూడా వినిపించారు. కానీ స్వరంలో తేడా. అదే పవన్ కు పరిశ్రమ నుంచి మద్దతు లేకుండా చేసింది.
తన ప్రసంగంలో నానితో పాటు ప్రభాస్, ఎన్టీఆర్, రానా ను కూడా కోట్ చేశారు పవన్. ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే వాళ్లకు కోట్లకు కోట్ల డబ్బు ఇచ్చేయలేదని, ఎంతో కష్టపడి, సిక్స్ ప్యాక్స్ సాధించి వాళ్లు డబ్బు సంపాదిస్తున్నారని పవన్ అన్నారు. సో… నానిలానే ప్రభాస్, ఎన్టీఆర్, రానా కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించాలి. కానీ అలా జరగలేదు. కార్తికేయ, దేవ కట్టా లాంటి ఒకరిద్దరు మినహా అంతా సైలెంట్.
ఈ సంగతి పక్కనపెడితే ఇప్పుడు పవన్ పై ఓ చిన్నసైజు తిరుగుబాటుకు సిద్ధమౌతోంది టాలీవుడ్. పవన్ కామెంట్స్ కు, ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు.. కొన్నాళ్లు పవన్ ను ఇండస్ట్రీ విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండమని చిరంజీవి ద్వారా చెప్పించే ప్రయత్నాలు జోరందుకున్నాయి.