కుల ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తామంటారు. పొద్దున్న లేస్తే కులాల గురించి మాట్లాడకుండా ఉండలేవు. తన కులం ఏంటో చెప్పుకోవడానికి ఇష్టపడనంటారు. మైక్ అందుకుంటే చాలు అందరి కులాల గురించి మాట్లాడతారు. రాజకీయ ప్రస్తానం ప్రారంభించినప్పట్నుంచి పవన్ వ్యవహారశైలి ఇలానే సాగుతోంది. ఇప్పుడు దాన్ని పీక్ స్టేజ్ కు తీసుకెళ్లారు పవన్.
ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్.. కులాల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇన్నాళ్లూ తన రాజకీయ ప్రసంగాలనే కులాల్ని పరిమితం చేసిన ఈ ''నాయకుడు''.. ఇప్పుడు ఏకంగా సినిమా ఫంక్షన్ లోకి కూడా కులాల్ని తీసుకొచ్చి తన బుర్ర నిండా కులగజ్జి అని నిరూపించుకున్నారు.
దిల్ రాజును ఉద్దేశించి మీరు నాతో వకీల్ సాబ్ ఎందుకు తీశారని ప్రశ్నించారు పవన్. మీరు వకీల్ సాబ్ తీయకుండా ఉండి ఉంటే ఈరోజు ఇంత రచ్చ జరిగేది కాదన్నారు. అసలు మీరు రెడ్డే కదా.. మీరు వెళ్లి జగన్ రెడ్డితో మాట్లాడొచ్చు కదా అని ఉచిత సలహా పడేశారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. రెడ్డితో మొదలుపెట్టి కాపు, బోయ, మాదిగ ఇలా చాలా కులాల్ని టచ్ చేశారు పవన్ కల్యాణ్.
అయితే ఈ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ ను సోషల్ మీడియా ఉపేక్షించలేదు. ఇప్పటికే పవన్ స్పీచ్ లో చాలా అంశాలపై ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. ఈ కుల ప్రస్తావనను మాత్రం గట్టిగా ఖండిస్తున్నారు. మీ అన్నయ్య (చిరంజీవి) వియ్యంకుడు (రామ్ చరణ్ మామ) కూడా రెడ్డే అని పవన్ కు గుర్తుచేస్తున్నారు. అల్లు అరవింద్ వియ్యంకుడు (అల్లు అర్జున్ మామ) కూడా రెడ్డే అని చెప్పుకొచ్చిన నెటిజన్లు.. వెళ్లి జగన్ తో మాట్లాడమని వాళ్లకు కూడా చెప్పొచ్చు కదా అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతల ఎదురుదాడి కొనసాగుతూనే ఉంది. ప్రైవేట్ పెట్టుబడులతో సినిమాలు తీసి ప్రభుత్వానికి టాక్సులు కట్టమని మొండికేస్తే ఎలా అంటూ పవన్ ను ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. టికెటింగ్ వ్యవస్థలో పారదర్శకత వస్తే పారితోషికం తగ్గించుకోవాల్సి వస్తుందనే భయంతోనే పవన్ అలా వీరావేశంతో ఊగిపోతూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని ఎద్దేవా చేస్తున్నారు.