నిన్న ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీ జనాలతో పాటు ఏ ఒక్కర్ని వదల్లేదు. అప్పటివరకు తన హిడెన్ లిస్ట్ లో ఉన్న అందర్నీ కెలికి వదిలేశాడు. చివరికి మోహన్ బాబును కూడా విడిచిపెట్టలేదు.
మోహన్ బాబుపై కూడా పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో మోహన్ బాబుకు కూడా స్పందించక తప్పలేదు. కాకపోతే ఇప్పుడు కాదు, అక్టోబర్ 10 తర్వాత స్పందిస్తానన్నారాయన.
“నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్.. నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంబోధించాను. పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు 'మా' ఎలక్షన్స్ జరుగుతున్నాయి.నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి.ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వుచేయవలసిన ముఖ్యమైన పని..నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్ కి వేసి వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ వెరీమచ్..”
ఇలా పవన్ వ్యాఖ్యలపై తర్వాత స్పందిస్తానంటూనే, పనిలో పనిగా తన కొడుక్కి ప్రచారం చేసుకున్నారు మోహన్ బాబు. తనదైన శైలిలో సుతిమెత్తగా చురకలు అంటిస్తూనే, ముందుంది ముసళ్ల పండగ అంటూ హింట్ కూడా ఇచ్చారు.
ఇంతకీ పవన్ కల్యాణ్ ఏమన్నారు..?
గంట సేపు సాగిన తన ప్రసంగంలో చాలామందిపై వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్, మోహన్ బాబును కూడా విడిచిపెట్టలేదు. వైసీపీకి మద్దతుదారుడు అయినందువల్లనే మోహన్ బాబును పవన్ టార్గెట్ చేశారు. సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విక్రయానికి ఓకే చెబితే.. రాబోయే రోజుల్లో మీ విద్యానికేతన్ లో సీట్లు కూడా ప్రభుత్వం ఆన్ లైన్లో భర్తీ చేస్తుందని, అది మీకు ఓకేనా అంటూ మోహన్ బాబును కెలికారు పవన్ కల్యాణ్.
“వైఎస్ మీకు బంధువని చెబుతుంటారు, నేను కూడా విన్నాను. మీరు వెళ్లి ఆయనతో మాట్లాడొచ్చు కదా. ఏమైనా ఉంటే పవన్ కల్యాణ్ ను బ్యాన్ చేసుకోమని, చిత్ర పరిశ్రమను ఇందులోకి లాగొద్దని చెప్పొచ్చుకదా” అంటూ మోహన్ బాబును ఈ వివాదంలోకి లాగారు పవన్ కల్యాణ్.
పవన్ వ్యాఖ్యలపై మోహన్ బాబు ఆవేశపడలేదు. ఎందుకంటే, మరో 2 వారాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలున్నాయి. ఇలాంటి టైమ్ లో పవన్ పై మోహన్ బాబు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా ఓట్లు చీలిపోతాయి. అందుకే సీనియర్ నటుడు, ఈ విషయంలో తన అనుభవాన్ని ఉపయోగించారు. ఆచితూచి స్పందిస్తానన్నారు. అక్టోబర్ 10 వరకు ఆగమన్నారు.