పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్నటికి నిన్న రిపబ్లిక్ సినిమా ఫంక్షన్ లో చేసిన ప్రసంగం ప్రకంపనాలు సృష్టిస్తూనే వుంది. కౌంటర్లు పడుతూనే వున్నాయి.
పవన్ అనుకోకుండా ప్రసంగించారా? లేక ముందుగా ప్లాన్డ్ గా చేసిన ప్రసంగమా? అని ఆరా తీస్తే, ఇది అంతా ప్లాన్డ్ గానే జరిగిందని తెలుస్తోంది.
సాయంత్రం ఇలా ప్రభుత్వంపై గట్టిగా విరుచుకుపడబోతున్నా అని ఆయన ముందుగానే తన మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ కు చెప్పారు.
అలాగే తనతో సినిమా చేయబోతున్న ఓ నిర్మాతను కొద్ది రోజుల క్రితమే పిలిచి, తను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లబోతున్నానని, ఇష్టమైతే ముందుకు వెళ్లమని, లేదంటే ప్రాజెక్టు ఆపేయమని కూడా చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే పవన్ తో సినిమా ప్లానింగ్ లో వున్న పెద్ద బ్యానర్ నిర్మాతల్లో ఒకరు శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి జగన్ ను కలిసినట్లు తెలుస్తోంది. అదే నిర్మాత నిన్నటికి నిన్న సెట్ లో పవన్ ను కలిసారు. టికెట్ ల జీవో రాబోతోందని ఆయన పవన్ కు చెప్పారని తెలుస్తోంది.
దాంతో ఇదే టైమ్ అని, తాను అటాక్ చేస్తే, ఆపై జీవో వస్తే అది తన ఖాతాలో క్రెడిట్ అవుతుందని పవన్ భావించారేమో? ఈ రోజు ఫంక్షన్ లో తన ప్రసంగం గురించి ఆ నిర్మాతకు కూడా చెప్పేసారు. మొత్తం మీద ప్లాన్డ్ గానే మైకు పట్టుకున్నారు.
కానీ మైకు పట్టుకున్న తరువాత కాస్త కంట్రోలు తప్పారు. అక్కరలేని విషయాలు, కొడాలి నాని ట్రేడ్ మార్క్ పదం సన్నాసి కూడా పవన్ నోటి వెంట వచ్చేసింది. ఇప్పడు మొత్తానికి పవన్ ప్లాన్ వికటించి, టాలీవుడ్ పీకకు చుట్టుకుంది.