పవన్ కు ఓ రేటు.. సంపూర్ణేష్ కు మరో రేటు ఎలా?

సిల్వర్ స్క్రీన్ పై విలన్లపై పంచ్ లేసే పవన్ కల్యాణ్ కు, రాజకీయాల్లో అసలైన పంచ్ పవర్ ఏంటో ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. నిన్న జరిగిన ఓ సినీ ఫంక్షన్ లో అధికార పార్టీపై…

సిల్వర్ స్క్రీన్ పై విలన్లపై పంచ్ లేసే పవన్ కల్యాణ్ కు, రాజకీయాల్లో అసలైన పంచ్ పవర్ ఏంటో ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. నిన్న జరిగిన ఓ సినీ ఫంక్షన్ లో అధికార పార్టీపై నోరు పారేసుకున్న పవర్'లెస్' స్టార్ కు ఇప్పుడు నేతల నుంచి వరుసగా పంచ్ లు పడుతున్నాయి. మరీ ముఖ్యంగా మంత్రి అనిల్ కుమార్ పంచ్ లు హైలెట్.

“పవన్ కల్యాణ్ కోసం మేం ఇండస్ట్రీని బలిపెడతామా? మాకేంటి అవసరం. అసలు పవన్ కల్యాణ్ ఎవరు? కళామతల్లి ముద్దుబిడ్డలంతా ఒక్కటేనని మీరే కదా చెబుతున్నారు. ఆ లెక్కన పవన్ కల్యాణ్ అయినా ఒకటే, సంపూర్ణేష్ బాబు అయినా ఒకటే. ఇద్దరూ పడే కష్టం ఒకటే. ప్రభాస్, సుధీర్ బాబు ఇద్దరూ సిక్స్ ప్యాక్ చేశారు. కష్టం ఇద్దరికీ ఒకటే కదా. కాబట్టి పవన్ కల్యాణ్ కష్టపడ్డాడని టిక్కెట్ రేటు పెంచాలా? ఆయనకు ఎక్కువమంది అభిమానులున్నారు కాబట్టి వంద రూపాయల టిక్కెట్ 200 రూపాయలు చేయమంటారా? ఇదెక్కడి న్యాయం.”

ఇలా పవన్ పై సెటైర్లు వేశారు అనీల్ కూమార్. జవాబుదారీతనం కోసం టిక్కెట్లు ఆన్ లైన్లో అమ్మితే తప్పేంటని ప్రశ్నించారు అనీల్ కుమార్. రేటు తగ్గించినా, పెంచినా ఒకే టాక్స్ వస్తున్నప్పుడు.. పెంచిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు.

“కొంతమంది చెబుతున్నట్టు టిక్కెట్ రేట్లు పెంచుదామనే అనుకుందాం. ఆ మేరకు టాక్స్ వస్తోందా? రావడం లేదు కదా. మరి ఆ డబ్బు ఎక్కడికి పోతోంది. అందుకే ఎకౌంటబులిటీ పెడదాం, ఆన్ లైన్ లో టిక్కెట్ అమ్ముదాం అంటున్నాం. అందులో తప్పేంది. బయట 200 రూపాయలకే అమ్మే టిక్కెట్ ఆన్ లైన్ లో పారదర్శకంగా అమ్మితే ఇబ్బందేంటి? పవన్ కు కోటి మంది అభిమానులున్నారు కాబట్టి, టిక్కెట్ రేటును వంద పెంచి 200 కోట్లు సంపాదిస్తామంటే ఎలా? పారదర్శకత అక్కర్లేదా ఆయనకి.”

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న పవన్ అభిమానులంతా 5-6 ఏళ్ల తర్వాత వాళ్లు చేసిన తప్పును తెలుసుకుంటారని.. తామంతా ఆ స్టేజ్ నుంచి ఎంతోకొంత పోగొట్టుకొని వచ్చిన వాళ్లమేనని అన్నారు మంత్రి.