Advertisement

Advertisement


Home > Movies - Movie News

రీల్‌‘హీరో’లే కాదు..రియ‌ల్ ‘హీరో’ల‌ని నిరూపించారు...

రీల్‌‘హీరో’లే కాదు..రియ‌ల్ ‘హీరో’ల‌ని నిరూపించారు...

సినీ హీరోలు, సెల‌బ్రిటీలు....రీల్ హీరోలే క‌దా రియ‌ల్ హీరోల‌నిపించారంతా. క‌రోనా వైర‌స్ దెబ్బ‌తో ప్ర‌పంచ‌మంతా వ‌ణికిపోతున్న విష‌యం తెలిసిందే. మ‌న దేశాన్ని కూడా మెల్లిగా క‌రోనా క‌మ్మేస్తోంది. దీంతో ప్ర‌ధాని మోడీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్ర‌ధాని మోడీ జ‌నతా క‌ర్ఫ్యూన‌కు పిలుపునివ్వ‌డం, దాన్ని దేశ‌మంతా విజ‌య‌వంతం చేయ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత దేశ‌మంతా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌లో ఉన్నారు. అయితే దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో...ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు సినీ హీరోలు, ద‌ర్శ‌కులు, ఇత‌రత్రా సిబ్బంది మాన‌వీయ దృక్ప‌థంలో ముందుకొచ్చారు.

తాము సీనిమాల్లోనే కాదు...అవ‌స‌ర‌మైతే నిజ జీవితంలో కూడా హీరోయిజాన్ని ప్ర‌ద‌ర్శిస్తామ‌ని నిరూపించారు. ల‌క్ష‌లు, కోట్ల రూపాయ‌ల‌ను విరాళాల కింద ప్ర‌క‌టించి త‌మ పెద్ద మ‌న‌సును చాటుకున్నారు. ఎవ‌రెవ‌రు ఎంతెంత విరాళం ఇచ్చారో తెలుసుకుందాం.

విరాళంలోనూ ప్ర‌భాస్ బాహుబ‌ళే: సినిమాలో మాత్రమే కాదు విరాళంలోనూ తాను బాహుబ‌ళి అని యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నిరూపించుకున్నారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌ నిమిత్తం తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి రూపాయలు ప్రకటించారు. ఈ రూ. కోటి విరాళం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి ఇవ్వనున్నట్లుగా ఆయన వెల్ల‌డించారు. అలాగే ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లుగా ఆయన ప్రకటించి అబ్బుర‌ప‌రిచారు.

మెగాస్టార్ విరాళం రూ.కోటి:  మెగాస్టార్ చిరంజీవి తాను రియ‌ల్ లైఫ్‌లో కూడా ఆప‌ద్భాంధువుడినే అని నిరూపించుకున్నారు. అక్ష‌రాలా కోటి రూపాయ‌ల విరాళం ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ విష‌యాన్ని ట్వీట్‌లో వెల్ల‌డించారు.

‘కరోనా మహమ్మారి కారణంగా ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం నా వంతు బాధ్యతగా రూ. కోటి విరాళాన్ని అందజేస్తున్నాను’ అని చిరంజీవి తన ట్వీట్‌లో తెలిపారు.

పవన్ స్టార్ ప‌వ‌ర్‌ఫుల్ విరాళం రూ. 2 కోట్లు:  అగ్ర‌హీరోనే కాకుండా జ‌న‌సేనానిగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు. మాన‌వ‌త్వంలో తాను మాట‌ల మ‌నిషిని మాత్ర‌మే కాదు...చేత‌ల మ‌నిషిన‌ని ఆయ‌న నిరూపించుకున్నారు. ఆయ‌న రూ.2కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్వీట్ చేశారు.

‘ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం అందిస్తాను. అలాగే భారత ప్రధాన మంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందిస్తున్నాను’ అని పవన్ ట్విటర్ ద్వారా తెలిపారు.  

మహేష్ బాబు రూ. కోటి విరాళం:  సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు మాన‌వ‌త్వంలో త‌న‌కు తానే సాటి అని చాటారు. త‌న వంతుగా రూ.కోటి విరాళాన్ని ప్ర‌క‌టించి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. క‌రోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్ర‌భుత్వాలు చ‌క్క‌టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌ని, ఈ పోరాటంలో త‌న‌ వంతు భాగ‌స్వామ్యంగా తెలంగాణ‌, ఏపీ ముఖ్యమంత్రుల స‌హాయ నిధుల కింద ఇద్ద‌రికీ క‌లిపి  కోటి రూపాయ‌ల్ని విరాళంగా ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

జూ.ఎన్టీఆర్ విరాళం రూ.75 ల‌క్ష‌లు: త‌న మామ చంద్ర‌బాబునాయుడు కంటే త‌న‌ది పెద్ద మ‌న‌సు అని హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ నిరూపించారు. క‌రోనా విప‌త్తును ఎదుర్కొనేందుకు త‌న వంతు సాయంగా ఆయ‌న రూ.75 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.25ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజూవారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌జేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు.

బాబాయ్ స్ఫూర్తితో  రామ్‌చరణ్ విరాళం రూ.70 ల‌క్ష‌లుః త‌న బాబాయ్ ప‌వ‌న్ స్ఫూర్తితో చిరు త‌న‌యుడు రామ‌చర‌ణ్ క‌రోనా నిరోధ పోరాటానికి బాస‌ట‌గా నిలిచారు.  క‌రోనా సృష్టించిన ఈ సంక్షోభ సమయంలో తాను రూ. 70 లక్షల విరాళం అందించనున్నట్టు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటం చేస్తున్న కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందజేయనున్నట్టు ప్రకటించారు.

రూ. 20 లక్షలు ప్రకటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్: కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సహాయపడేందుకు ప్ర‌ముఖ  డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుకొచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు అందించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విటర్ ద్వారా ప్రకటించారు.  

నితిన్ విరాళం:  హీరో నితిన్ మొట్ట మొద‌ట‌గా సినీ రంగం నుంచి క‌రోనా బాధితుల‌ను ఆదుకోవ‌డానికి ముందుకొచ్చారు. ఆయ‌న‌తో మొద‌లైన విరాళాల ప‌ర్వం ...ఆ త‌ర్వాత ఊపందుకొంది. హీరో నితిన్ త‌న వంతు విరాళం కింద తెలంగాణకు 10 లక్షలు, ఏపీకి 10 లక్షలు అంద‌జేసి శ‌భాష్ అనిపించుకున్నారు.

దిల్ రాజు విరాళం రూ.20 ల‌క్ష‌లుః నిర్మాత దిల్‌రాజు త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. క‌రోనా విప‌త్తును ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వాల‌కు ఆయ‌న బాస‌ట‌గా నిలిచారు. త‌న వంతు క‌ర్త‌వ్యంగా ఏపీ, తెలంగాణ స‌ర్కార్‌ల‌కు ఒక్కో రాష్ట్రానికి రూ.10 ల‌క్ష‌ల చొప్పున మొత్తం రూ.20 ల‌క్ష‌ల‌ను ఆయ‌న విరాళం ప్ర‌క‌టించారు.

సాయితేజ్ రూ. 10 లక్షల విరాళం:  హీరో సాయితేజ్ కూడా క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. స‌మాజం క‌ష్టకాలంలో ఉంటే...తానెప్పుడూ అండ‌గా ఉంటాన‌ని నిరూపించారు. త‌న వంతుగా రూ.10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు.

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూ. 10 ల‌క్ష‌ల విరాళం: ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కూడా త‌న బాధ్య‌త‌ను నెర‌వేర్చేందుకు ముందుకొచ్చారు. క‌ష్ట స‌మ‌యంలో త‌లా ఒక చెయ్యి వేసి అదుకోవాల‌నే త‌లంపుతో ఆయ‌న రూ.10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. అలాగే హీరో అల్ల‌రి న‌రేష్ కూడా రూ.50 వేల‌కు పైగా విరాళం ప్ర‌క‌టించి త‌న శ‌క్తి మేర‌కు పెద్ద మ‌న‌సుతో వ్య‌వ‌హ‌రించారు.  ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ, మ‌రో ద‌ర్శ‌కుడు వివి వినాయ‌క్ కూడా చెరో రూ.5 ల‌క్ష‌లు చొప్పున విరాళం ప్ర‌క‌టించి శ‌భాష్ అనిపించుకున్నారు.  

మొత్తానికి సినిమా రంగం నుంచి ఎవ‌రూ ఊహించ‌ని విధంగా క‌రోనా విప‌త్తును ఎదుర్కొనేందుకు ఒక్కొక్కరుగా ముందుకొచ్చి ఆర్థిక సాయం అందిస్తుండ‌టం గ‌ర్వ‌కార‌ణం. వీరి స్ఫూర్తితో మ‌రింత మంది విరాళాలు ప్ర‌క‌టించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

అందర్నీ చూసుకుంటా.. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?