విడుదల తేదీల విషయంలో టాలీవుడ్ లో ఆది నుంచి కొట్లాట ఉంది. మంచి డేట్ కనిపిస్తే పొలోమంటూ అందరూ ఒకేసారి కర్చీఫ్ లు వేస్తారు, ఎంతమంది తప్పుకుంటారనేది తర్వాత సంగతి. బాలీవుడ్ తరహాలో రిలీజ్ డేట్స్ విషయంలో ఇక్కడ ప్లానింగ్ తక్కువ. ఉంటే అతివృష్టి, లేదంటే అనావృష్టి టైపులో ఉంటుంది ఇక్కడ వ్యవహారం.
ఈ నెలలో బాక్సాఫీస్ లో అనావృష్టి కనిపిస్తోంది. 30 రోజులు.. 4 శుక్రవారాలు.. వందల కొద్దీ స్క్రీన్స్.. కానీ థియేటర్లలోకి రావడానికి చెప్పుకోదగ్గ హీరో ఒక్కడు కూడా ముందుకురావడం లేదు. మహేష్, ప్రభాస్, బన్నీ లాంటి పెద్ద హీరోల సంగతి సరేసరి. వాళ్లకు పండగలు కావాలి. కనీసం మిడ్-రేంజ్ హీరోలు కూడా నవంబర్ లో థియేటర్లలోకి రావడం లేదు. అదే బాధాకరం. వీళ్లకు కూడా ఇప్పుడు పండగ తేదీలే కావాల్సి వచ్చాయి.
ఈ రాబోయే శుక్రవారమే తీసుకుంటే, చెప్పుకోదగ్గ హీరో ఒక్కడు కనిపించడం లేదు. కీడాకోలా, పొలిమేర-2, నరకాసుర లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. వీటిలో కంటెంట్ మెరవాల్సిందే తప్ప స్టార్ పవర్ లేదు.
రెండో వారం కూడా ఇదే పరిస్థితి. అన్వేషి వ్యూహం, అలా నిన్ను చేరి లాంటి సినిమాలొస్తున్నాయి. ఇక్కడ కూడా చెప్పుకోదగ్గ హీరో లేడు. కనీసం కాస్త క్రేజ్ ఉన్న చిన్న హీరోలు కూడా కనిపించడం లేదు. ఇదేవారం లారెన్స్ నటించిన జిగర్తాండా డబుల్ ఎక్స్ వస్తోంది, కానీ అది డబ్బింగ్ సినిమా. పోనీ దీన్ని లెక్కలోకి తీసుకుందామంటే, లారెన్స్ తాజా చిత్రం చంద్రముఖి-2 రిజల్ట్ అందరికీ తెలిసిందే.
మూడో వారంలో స్పార్క్, మంగళవారం, సప్తసాగరాలు దాటి సైడ్-బి లాంటి సినిమాలొస్తున్నాయి. వీటిలో స్టార్ పవర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. కాకపోతే ఉన్నంతలో మంగళవారం సినిమా ఎట్రాక్ట్ చేస్తోంది. ఇందులో కూడా హీరో లేడు, పాయల్ మాత్రమే పెద్దగా కనిపిస్తోంది.
నాలుగో వారంలో ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ లాంటి సినిమాలొస్తున్నాయి. ఇక్కడ మాత్రం వైష్ణవ్ తేజ్ కనిపిస్తున్నాడు. ఇలా నవంబర్ నెలలో మొదటి శుక్రవారం నుంచి మొదలుపెడితే, చివరి శుక్రవారం వరకు ఒక్కడంటే ఒక్క స్టార్ హీరో కూడా థియేటర్లలోకి రావడం లేదు. అంతోఇంతో ఈ నెలలో కల్యాణ్ రామ్ మాత్రమే కాస్త కంటికి కనిపిస్తున్నాడనుకునేలోపే, అతడు నటించిన డెవిల్ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. కంటెంట్ క్లిక్ అయితే చిన్న సినిమాలకు ఇంతకంటే మహదావకాశం మళ్లీ దొరకదు. ఆ అదృష్టం ఏ సినిమాను వరిస్తుందో చూడాలి.