సందేహం లేదు. సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో క్రేజీ కాంబినేషన్ గుంటూరు కారం సినిమాదే. సూపర్ స్టార్ మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ కదా. కానీ అంత మాత్రం చేత తమదే పైచేయి, మిగిలిన వాళ్లు థియేటర్ల కోసం డిస్కషన్ కు తమ దగ్గరకే రావాలి అని అనడం ఎంత వరకు కరెక్ట్? నిర్మాత నాగవంశీ ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటల ను ఇండస్ట్రీ జనాలు ఆఫ్ ది రికార్డుగా తప్పు పడుతున్నారు.
మీడియా థియేటర్ల సమస్య డిస్కస్ చేస్తున్నారా? అని అడిగినపుడ, కూర్చుని మాట్లాడుకుంటాం అని అంటే సరిపోయేది కదా అని కామెంట్ చేస్తున్నారు. అలా కాకుండా పండగ సినిమాల్లో ముందుగా ఏది చూడాలనుకుంటున్నారు? గుంటూరు కారం సినిమానే కదా? అందువల్ల మిగిలిన వాళ్లు వచ్చి మాట్లాడాలి కానీ తాను ఎందుకు వెళ్లి మాట్లాడతా అనేలా నాగవంశీ బదులు ఇచ్చారు.
సినిమా థియేటర్ లోకి వచ్చే వరకే కాంబినేషన్. ఓపెనింగ్ అనేది కూడా దాని వరకే. వన్స్ థియేటర్ లోకి వచ్చాక ఏ సినిమా అయినా కంటెంట్ నే మాట్లాడుతుంది. గొప్ప కాంబినేషన్ లు అనుకున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తేడా చేసినవి వున్నాయి. తక్కువ కాంబినేషన్ అనుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ లు అయినవీ వున్నాయి. ఉదాహరణలు చెప్పుకోవాలంటే చాలా వున్నాయి. ఇదే కనుక ఇప్పుడు సలార్ మరోసారి వాయిదా పడి సంక్రాంతికి వస్తే పరిస్థితి ఏమిటి? రాదు కాబట్టి ఓకె. వస్తే…?
మన వరకు మనకు మన సినిమా గొప్ప. వాళ్ల వరకు వాళ్ల సినిమా గొప్ప. ఎంత గుంటూరు కారం క్రేజ్ వున్నా వెంకటేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ లేదా రవితేజ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ప్రిఫరెన్స్ దేనికి వుంటుంది? వాళ్ల హీరో సినిమాకే కదా? అందువల్ల తొందర పడి వాళ్లే తమ దగ్గరకు రావాలి. తాము ఎందుకు వెళ్లాలి అని అనడం కరెక్ట్ కాదేమో? సోషల్ మీడియాలో జనాలు పెడుతున్న కామెంట్లు చూస్తే నాగవంశీ తాను మాట్లాడిన దాంట్లో కాస్త తొందరపాటు వుందని తప్పకుండా గ్రహిస్తారేమో?