ఎన్టీఆర్ చిన్న గీత.. రామ్ చరణ్ పెద్ద గీత

ఒక గీతను చిన్నదిగా చూపించాలంటే ఏం చేయాలి, దాని పక్కన ఓ పెద్ద గీత గీస్తే సరి. నిజానికి అది చిన్న గీత కాదు, కానీ పక్కనున్న గీతను పెద్దగా చూపించడం వల్ల ఇది…

ఒక గీతను చిన్నదిగా చూపించాలంటే ఏం చేయాలి, దాని పక్కన ఓ పెద్ద గీత గీస్తే సరి. నిజానికి అది చిన్న గీత కాదు, కానీ పక్కనున్న గీతను పెద్దగా చూపించడం వల్ల ఇది చిన్నదైంది. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ విషయంలో ఇదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది.

ఎన్టీఆర్ నటకౌశలాన్ని ఎవ్వరూ తక్కువ చేసి చూడలేరు. యాక్టింగ్ లో తారక్ తోపు. ఇక డాన్స్ లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న స్టార్. రికార్డుల్లో కూడా తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్న మాస్ హీరో. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇండస్ట్రీలో టాప్-3లో ఒకడు. ఇలాంటి హీరోను తక్కువ చేసి చూపే ప్రయత్నం కొన్నాళ్లుగా జరుగుతోంది.

ఆర్ఆర్ఆర్ నుంచి మొదలు…

ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజైందో, సరిగ్గా అప్పట్నుంచే ఈ చిన్నగీత-పెద్దగీత కాన్సెప్ట్ ఆరంభమైంది. పనిగట్టుకొని కొంతమంది కొమురం భీమ్ పాత్రపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. సినిమాలో ఎన్టీఆర్ పాత్ర బాగుందని, కానీ చరణ్ పోషించిన సీతారామరాజు పాత్ర, దాని ఎలివేషన్లు ఇంకా బాగున్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు. అదిగో అక్కడ్నుంచి మొదలైంది వివక్ష.

ఆస్కార్ ప్రమోషన్స్ లో…

ఆ వివక్ష ఏడాదిగా కొనసాగుతూనే ఉంది. చివరికి ఎన్టీఆర్-చరణ్ కలిసి దిగిన ఫొటోల్ని రిలీజ్ చేసినా, అందులోంచి తారక్ స్టిల్ ను తొలిగించి, కేవలం చరణ్ స్టిల్ ను వైరల్ చేసే పాడు సంస్కృతి వచ్చేసింది. చివరికి ఆస్కార్ ప్రమోషన్స్ వరకు ఇది కొనసాగింది.

ఆస్కార్ ప్రమోషన్స్ లో ముందుగా తారక్ ను రంగంలోకి దించారు. అతడితో కొన్ని ఆర్గానిక్ ప్రమోషన్స్ తో పాటు, పెయిడ్ ప్రమోషన్స్ చేయించారు. అంతా బాగుందనుకున్న టైమ్ లో మెగా కాంపౌండ్ రంగంలోకి దిగింది. తారక్ ఇటు రావడం, చరణ్ అటు వెళ్లడం.. ఆ వెంటనే గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను ప్రచారంలోకి తీసుకురావడం తారాస్థాయిలో జరిగిపోయాయి. ఇంకా చెప్పాలంటే, హాలీవుడ్ లో తారక్ ఎలివేషన్స్ కంటే.. చరణ్ ఎలివేషన్స్ ఎక్కువయ్యాయి. అలా అక్కడ కూడా తారక్ ను చిన్నగా చూసే ప్రయత్నం సక్సెస్ ఫుల్ గా జరిగింది.

వార్-2 అవకాశం వచ్చినప్పుడు కూడా..

ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్నగాక మొన్న వార్-2లో ఎన్టీఆర్ చేయబోతున్నాడనే వార్త బ్రేక్ అయింది. ఆ వెంటనే దానికి అనుబంధంగా రూమర్లు వచ్చేశాయి. అది కూడా ఎన్టీఆర్ ఔన్నత్యాన్ని తగ్గించేలా. వార్-2లో ఓ కీలక పాత్ర కోసం ముందుగా ప్రభాస్ ను సంప్రదించారట. ఆయన రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత విజయ్ దేవరకొండను సంప్రదించారట, ఆయన కూడా తిరస్కరించాడట. వాళ్లిద్దరూ కాదనడంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ ను తీసుకున్నారంటూ వ్యతిరేక కథనాలు రావడం మొదలయ్యాయి. అంటే.. పరోక్షంగా ప్రభాస్, దేవరకొండకు ఉన్నంత క్రేజ్ బాలీవుడ్ లో ఎన్టీఆర్ కు లేదని చెప్పడం కొంతమంది ఉద్దేశం.

ఇక్కడ చెప్పుకున్నవి కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే గడిచిన ఏడాదిగా ఎన్టీఆర్ ను తగ్గించి చూపించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి.. ఎవరు చేస్తున్నారు.. ఏం ఆశించి ఈ ప్రచారం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు..? ఇవన్నీ సామాన్య ప్రేక్షకులకు అర్థంకాకపోయినా, ఎన్టీఆర్ కు ఈజీగానే అర్థమౌతాయి.