ప్రస్తుతం టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల హవా నడుస్తోంది. మొన్నటికిమొన్న కాంతార వచ్చింది. ఓ ఊపు ఊపి వెళ్లింది. అంతకంటే ముందు సర్దార్, కేజీఎఫ్2 సినిమాల హవా నడిచింది. ఇప్పుడా ట్రెండ్ ను కొనసాగిస్తూ లవ్ టుడే సినిమా వచ్చింది.
తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా, తాజాగా తెలుగులో కూడా దాదాపు అదే టాక్ సొంతం చేసుకుంది. ఇలా కాంతార హవా ముగిసిందో లేదో అలా లవ్ టుడే ఫీవర్ టాలీవుడ్ ను చుట్టుకుంది. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ సినిమా మాటే.
లవ్ టుడేతో పాటు అల్లరినరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రిలీజైంది. ఈ సినిమా కంటే లవ్ టుడేకు ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. రెండో రోజు వసూళ్లలో కూడా లవ్ టుడేదే అగ్రస్థానం. పూర్తిగా యూత్ ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ డబ్బింగ్ సినిమా ఈ వీకెండ్ టాలీవుడ్ నంబర్ వన్ గా నిలిచింది.
తెలుగులో ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేశారు. మరోవైపు కాంతార టైపులో ఈ సినిమా కూడా ఓటీటీలోకి ఆలస్యంగా రాబోతోంది. తెలుగులో సక్సెస్ అవ్వడంతో, ముందుగా నెట్ ఫ్లిక్స్ లో తమిళ వెర్షన్ ను విడుదల చేస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తెలుగు వెర్షన్ పెడతారు.