నాన్నగారు నాకిచ్చిన ఆస్తి అదే – మహేష్ బాబు

హీరో మహేష్ బాబు మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకున్నారు. తండ్రి తనకిచ్చిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే, అది అభిమానుల అభిమానం మాత్రమే అన్నారు.…

హీరో మహేష్ బాబు మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకున్నారు. తండ్రి తనకిచ్చిన గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే, అది అభిమానుల అభిమానం మాత్రమే అన్నారు.

“నాన్నగారు నాకు చాలా ఇచ్చారు. కానీ అన్నిటికంటే గొప్పది, ఆయన నాకు ఇచ్చింది మీ అభిమానం. ఆయనకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాన్నగారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు, మీ గుండెల్లో ఉంటారు, మన మధ్యలోనే ఉంటారు. మీ అభిమానం, ఆశీస్సులు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.”

కృష్ణ పెద్దకర్మను శాస్త్రోక్తంగా, ఘనంగా నిర్వహించారు మహేష్ బాబు. ముందుగా ఇంట్లో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భోజనాల కోసం రెండు భారీ వేదికలు సిద్ధం చేశారు. ప్రముఖుల కోసం ఎన్-కన్వెన్షన్ లో, అభిమానుల కోసం జేఆర్సీ ఫంక్షన్ హాల్ లో భోజనాలు ఏర్పాటుచేశారు.

మంత్రి తలసానితో మహేష్ బాబు ముచ్చటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్, మెహర్ రమేష్ హాజరయ్యారు.

అటు జేఆర్సీ లో అభిమానుల కోసం ఏకంగా 32 రుచులతో భోజనాలు ఏర్పాటు చేశాడు మహేష్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫ్యాన్స్ కు పాస్ లు ఇచ్చాడు. రద్దీ తగ్గేకొద్దీ మరింతమందిని లోపలికి అనుమతించారు. అలా దాదాపు 6వేల మందికి భోజనాలు పెట్టారు.