టాలీవుడ్ లో ఇప్పుడంతా టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ బయోపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దీనికి తోడుగా మరో గజదొంగ రెడీ అయ్యాడు. ఇతడి పేరు జపాన్. టైగర్ నాగేశ్వరరావు చెప్పి మరీ దొంగతనం చేస్తాడు. జపాన్ అనే గజదొంగ మాత్రం మూడో కంటికి తెలియకుండా దోచేస్తాడు.
హార్ట్ ఆఫ్ ది సిటీలో పక్కా బిల్డింగ్ కు కన్నమేసి 200 కోట్ల రూపాయల విలువ చేసే నగలు కొట్టేస్తాడు. ఇప్పటివరకు జపాన్ పై 182 కేసులు నమోదయ్యాయి. కానీ ఒక్కసారి కూడా దొరకలేదు, కనీసం పోలీస్ కంటికి కూడా కనిపించలేదు.
నాలుగు రాష్ట్రాల పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్నాడు జపాన్. అతడి వృత్తి దొంగతనం, ప్రవృత్తి అమ్మాయిలతో విలాసాలు, బంగారం. ఇలా జపాన్ సినిమాలో కార్తి పాత్రకు వివరిస్తూ టీజర్ రిలీజ్ చేశారు ఇవాళ.
ఈ సినిమా కోసం దర్శకుడు ఓ ఫిక్షన్ ప్రపంచాన్ని సృష్టించాడు. ఏ కాలం అనేది కూడా ప్రస్తుతానికి చెప్పలేదు. 'ఎన్ని బాంబులు వేసిన ఈ జపాన్ ను ఎవరూ ఏం పీకలేర్రా'' అంటూ డిఫరెంట్ మాడ్యులేషన్ లో కార్తి చెప్పిన డైలాగ్ బాగుంది. కార్తి, తెలుగులో తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటాడనే విషయం తెలిసిందే.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కింది జపాన్ సినిమా. అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. దీపావళికి సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఆల్రెడీ దీపావళికి అన్ని భాషల్లో గట్టిపోటీ ఉంది. తమిళ్ లో జిగర్ తాండా డబుల్ ఎక్స్ షెడ్యూల్ అయింది. ఇటు తెలుగులో ఆదికేశవతో పాటు మరో 2 సినిమాలున్నాయి. ఇక సల్మాన్ నటించిన టైగర్-3 దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పుడీ రేసులోకి జపాన్ కూడా చేరింది.