నారా లోకేష్ ఢిల్లీలో మకాం పెట్టినతరుణంలో, ఏపీకి రావడానికి ఆయన భయపడుతున్నాడనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఒక లీక్ వదిలారు.. లోకేష్ వచ్చేస్తున్నాడని, యువగళం కొనసాగింపు అంటూ లీకులిచ్చారు! లోకేష్ భయంతో ఢిల్లీలో కూర్చున్నాడనే ప్రచారం గట్టిగా సాగుతున్న నేపథ్యంలో.. యువగళం కొనసాగింపు అంటూ ఒక లీకొదిలారు!
ఇదంతా జరిగి పక్షం రోజులు గడిచిపోయాయి. అయితే నారా లోకేషుడి యువగళం ఊసు మాత్రం లేదిప్పుడు! అసలు అలాంటి ప్రోగ్రామ్ ఒకటి చేపట్టినట్టుగా లోకేష్ కూడా మరిచిపోయినట్టుగా ఉన్నారు! అది మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది? అసలు మొదలవుతుందా? లేక అర్ధాంతరంగా ఆగిపోయినట్టేనా? అనేవి శేష ప్రశ్నలు. మరి పరిస్థితిని చూస్తుంటే.. లోకేష్ పాదయాత్ర దాదాపు ఆగిపోయినట్టే అని అనుకోవాల్సి వస్తోంది.
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో లోకేష్ జనం మధ్యన తిరిగి సానుభూతి ఏదైనా వస్తే దాన్ని కూడా షో చేయాల్సింది. చంద్రబాబును అరెస్టు చేసిన నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా లోకేష్ పాదయాత్రకు పోటెత్తితే ఆ దృశ్యాలను కూడా చూపాల్సింది. అయితే చంద్రబాబు తనయుడేమో.. వారాలకు వారాలు కేరాఫ్ ఢిల్లీ గా పొద్దు పుచ్చుతున్నారు!
ఏదో నామమాత్రపు నిరసన చేస్తూ.. అదే చాలనుకుంటున్నట్టుగా లోకేష్ కాలం గడుపుతున్నట్టుగా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు విడుదల ఆలస్యం అయ్యే కొద్దీ లోకేష్ పాదయాత్ర కూడా ఊసులో లేకుండా పోతుంది. ఇప్పటికే పాదయాత్ర ఎక్కడిందో కానీ.. నెల అయితే గడిచిపోయింది. ఎన్నికలకు ఉన్న సమయంలో ఇంకో ఆరు నెలలు. ఈ నెలలో రోజుకో పది కిలోమీటర్ల చొప్పున సాయంకాలం వేళల్లో వాకింగ్ చేసి.. ఇంకో మూడొందల కిలోమీటర్లు పూర్తయినట్టుగా ప్రకటించుకునే వారు. ఆ అవకాశం లేకుండా పోయింది.
మరి చంద్రబాబు బయటకు వచ్చే వరకూ లోకేష్ యాత్ర ఊసు లేనట్టే. ఇప్పుడు లోకేష్ కే ఆ ఆసక్తి లేనట్టుగా ఉంది. మరి చంద్రబాబు బయటకు వచ్చే సమయానికి ఏ ఎన్నికల నోటిఫికేషనో వచ్చేస్తే… అప్పుడు లోకేష్ యువగళం సాగించే సీన్ ఉండకపోవచ్చు.