2036లో ఒలింపిక్స్ ను ఇండియాలో నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్నట్టుగా ప్రకటించారు నరేంద్రమోడీ. 2036 ఒలింపిక్స్ నిర్వహణ బిడ్ కోసం.. శాయశక్తులా ప్రయత్నించనున్నట్టుగా మోడీ స్పష్టం చేశారు. తద్వారా ఒలింపిక్స్ నిర్వహణ విషయంలో గట్టి పట్టుదలనే కనబరుస్తున్నారు మోడీ!
మరి ఒలింపిక్స్ నిర్వహించడం అంటే మాటలు కాదు. ఎంతో కఠిన శ్రమతో 2008లో చైనా ఒలింపిక్స్ నిర్వహించింది. ఆ తర్వాత బ్రెజిల్ కూడా ప్రతిష్టకు పోయి ఒలింపిక్స్ నిర్వహించింది. వాటికి దశాబ్దాల కిందట నుంచే ఏర్పాట్లు జరిగాయి. అయితే ఒలింపిక్స్ నిర్వహణ వల్ల బ్రెజిల్ చేతులు కాల్చుకుందనే వార్తలూ ఆ తర్వాత వచ్చాయి. ప్రతిష్టకు పోయి నిర్వహించింది కానీ, దాని వల్ల ఆ దేశానికి ఆర్థికంగా భారమే తప్ప పెద్ద ఉపయోగం దక్కలేదనే విశ్లేషణలు వినిపించాయి.
అప్పట్లోనే బ్రెజిల్ లక్ష కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసింది ఒలింపిక్స్ నిర్వహణకు అనే వార్తలు వచ్చాయి! మరి ఇప్పటి పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహణకు సకల ఏర్పాట్లు చేయడానికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుందో మరి! అయితే రాత్రికి రాత్రి అందుకు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు. 2036 నాటికి ఇప్పుడు బిడ్స్ ను ఖరారు చేస్తున్నారంటే.. పుష్కర కాలంలో ఏర్పాట్లు చేసుకోవచ్చు అని స్పష్టం అవుతోంది.
లాస్ట్ ఒలింపిక్స్ ను జపాన్ నిర్వహించింది. వచ్చే ఏడాది ఒలింపిక్స్ పారిస్ లో జరగనున్నాయి. 2028 ఒలింపిక్స్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో జరగబోతున్నాయి. 2032 ఒలింపిక్స్ బిడ్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. గతంలో సిడ్నీ వేదికగా ఒలింపిక్స్ ను నిర్వహించిన ఆస్ట్రేలియా తన తదుపరి ఆతిథ్యాన్ని బ్రిస్బేన్ వేదికగా ఇవ్వబోతోంది!
ఒలింపిక్స్ నిర్వహణ అనేది ప్రతిష్టాత్మకమైన అంశం. పర్యాటకం పెరుగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు దక్కుతాయి. దేశంలో పిల్లలకు స్పోర్ట్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్వాహక నగరంలో స్పోర్ట్స్ ఇన్ ఫ్రా ఏర్పడుతుంది. అయితే దీని కోసం ఖర్చు భారీ స్థాయిలో ఉంటుంది.
ఒలింపిక్స్ కోసమే స్టార్ హోటల్స్ నిర్మాణంతో సహా మొదలుపెట్టాలి! అయితే బిడ్ ను వేయడమే కాకుండా, దక్కించుకోవడానికి తమ అర్హతలన్నింటినీ ఆతిథ్య దేశం చూపించాల్సి ఉంటుంది. మరి మోడీ గట్టిగా ప్రకటన చేశారు. బహుశా అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహణకు మోడీ పట్టుదలతో ఉండవచ్చనే అబిప్రాయాలూ వినిపిస్తున్నాయి!