యంగ్ హీరో రాజ్ తరుణ్-దర్శకుడు కొండా విజయ్ కుమార్ కాంబినేషన్ లో నిర్మాణమవుతున్న ఒరేయ్ బుజ్జిగా సినిమా విడుదలకు రెడీ అయిపోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. లేటెస్ట్ గా ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తయారవుతున్న ఈ సినిమా జోనర్ ను క్లారిటీగా చెప్పే విధంగా పోస్టర్ ను డిజైన్ చేసారు.
ఇప్పటి దాకా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లు చేసి, శభాష్ అనిపించుకున్న కొండా విజయ్ కుమార్ ఈసారి మరింత ఎంటర్ టైన్ మెంట్ జోడించి చేస్తున్న సినిమా ఇది. టైటిల్ లోనే ఫన్ ఏ లెవెల్ లో వుంటుందో తెలిసిపోతోంది. రాజ్ తరుణ్ సరసన ఈ సినిమాలో మాళవిక నాయర్ నటిస్తోంది. ఈ సినిమా తనకు కచ్చితంగా కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని రాజ్ తరుణ్ భావిస్తున్నాడు.
శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ ” మా 'ఒరేయ్ బుజ్జిగా…' ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నాం . ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
రాజ్ తరుణ్ కి తగిన యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సమ్మర్ స్పెషల్ గా చిత్రాన్ని విడుదల చేయనున్నాం. మా బ్యానర్ లో 'ఏమైంది ఈ వేళ', 'అధినేత', 'బెంగాల్ టైగర్', 'పంతం' వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ ఇది. రాజ్ తరుణ్, కొండా విజయ్ కుమార్, అనూప్ రూబెన్స్ లకు, మా బ్యానర్ కు తప్పకుండా మా ‘ఒరేయ్ బుజ్జిగా…’ చాలా మంచి కమర్షియల్ సినిమా అవుతుంది” అన్నారు.