ఓ అధికారి సస్పెండ్ అయితే స్పందించాల్సిన అవసరం చంద్రబాబుకు లేదు. పోనీ అతడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కాబట్టి రియాక్ట్ అయ్యాడని అనుకుందాం. కానీ బాబు ఇంతలా ఉలిక్కిపడుతున్నాడంటే ఏదో ఉండే ఉంటుందని అంతా అనుమానించారు. ఆ అనుమానాలు ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి వెంకటేశ్వర రావు వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థకు జగన్ అప్పగించబోతున్నారనే విషయం బయటకొచ్చినప్పట్నుంచి బాబుతో వణుకు మొదలైంది. అందుకే గుమ్మడికాయ దొంగ అనగానే ఇలా భుజాలు తడుముకుంటున్నారు.
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై వచ్చిన ఆరోపణలు సాధారణమైనవి కావు. అవేవో అవినీతి అరోపణలో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమో అయితే జగన్ కూడా లైట్ తీసుకునేవారు. కానీ ఇది రాష్ట్రాన్ని దాటి దేశానికి సంబంధించిన వ్యవహారంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్థ నుంచి నిఘా పరికరాలు కొన్నారనేది ప్రధానమైన ఆరోపణైతే.. విదేశా సంస్థతో దేశ భద్రతకు సంబందించిన సమాచారాన్ని పంచుకున్నారనేది మరో కీలకమైన ఆరోపణ.
దీనికి తోడు కొనుగోలు చేసిన నిఘా పరికరాల్లో నాణ్యత లేకపోవడం, ఆ పరికరాల కొనుగోలు కాంట్రాక్ట్ ను తన కొడుక్కే కట్టబెట్టడం లాంటి ఆరోపణలు కూడా వెంకటేశ్వరరావుపై ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు చేయడం కరెక్ట్ కాదు. అందుకే ఎన్ఐఏ లేదా సీబీఐతో దర్యాప్తు చేయాల్సిందింగా జగన్ కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది.
భద్రతకు సంబంధించిన ఇలాంటి అంశాల్లో కేంద్ర హోంశాఖ అస్సలు ఛాన్స్ తీసుకోదు. కాబట్టి విచారణ సమగ్రంగా, పూర్తిస్థాయిలో జరుగుతుంది. అదే కనుక జరిగితే గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన అరాచకాలన్నీ బయటపడడం ఖాయం. చట్టానికి విరుద్ధంగా పోలీసు వ్యవస్థను చంద్రబాబు ఎలా వాడుకున్నారనే విషయాల్ని బయటపెట్టడానికి వెంకటేశ్వరరావు ఎలాంటి మొహమాటం పడరు. పోలీసు శాఖకు మద్దతుగా మాట్లాడ్డానికి, వెంకటేశ్వరరావుపై బాబు సవతి ప్రేమ ఒలకబోయడానికి ఇదే ప్రధాన కారణం.
పాపం, నేరుగా మద్దతు పలకలేక.. వెయిటింగ్ లో పెట్టారు, జీతాలు కట్ చేశారంటూ ట్వీట్లు పెడుతూ నాలుగు గోడల మధ్య వణికిపోతున్నారు బాబు. అప్పట్లో తమపై ప్రభుత్వం నిఘా పెట్టిందంటూ వైసీపీ పార్టీ జనాలు ఎందుకు ఆరోపించారో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది. చూస్తుంటే.. ఈ వ్యవహారం బాబు మెడకు కాస్త గట్టిగానే చుట్టుకునేలా కనిపిస్తోంది.