జగన్ సర్కార్‌పై యుద్ధంలో ‘ఎల్లో మీడియా’ అస్త్రం ఇక పారదనే నిర్ణయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చినట్టున్నాడు. అయితే జగన్ సర్కార్‌పై గురి పెట్టేందుకు ‘మీడియా’ అనే గన్ మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. మందుగుండు సామగ్రి మాత్రం ఈ దఫా మార్చాడు. ఆ ముందు గుండే ‘జాతీయ మీడియా’. అంటే లోకల్‌గా ‘జాతి’ మీడియా, దేశస్థాయిలో ‘జాతీయ’ మీడియా అన్నమాట.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై చర్చ మొదలైనప్పటి నుంచి ఎలాగైనా జగన్ సర్కార్‌ను భ్రష్టుపట్టించాలని టీడీపీ, ఆ పార్టీ అనుబంధ ఎల్లో మీడియా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. అన్ని రకాలుగా దిగజారి వార్తా కథనాలను వండి వారుస్తున్నారు. అయితే సోషల్ మీడియా బలపడటంతో ‘ఎల్లో’ మీడియాను విశ్వసించే పరిస్థితి కరువైంది.
దీంతో ప్రతిపక్ష టీడీపీ రూటు మార్చాడు. జాతీయ స్థాయిలో జగన్ సర్కార్‌ను భ్రష్టు పట్టించేందుకు వ్యతిరేక కథనాలను రాయించేందుకు తనదైన శైలిలో కుట్నపన్నాడు. గత డిసెంబర్ 17న అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రక్రియపై అంచనాను చెప్పినప్పటి నుంచి టీడీపీ ఆర్థిక సామ్రాజ్యం కూలిపోతున్నదనే భయాందోళనలతో తాడోపేడో తేల్చుకోవాలని చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. అయితే ఏది చేసినా ఇక అమరావతి నుంచి రాజధానిని తరలకుండా ఆపడం తన వల్ల సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చాడు.
కానీ ఏపీలో జగన్ సర్కార్ నిర్ణయాలు పారిశ్రామిక ప్రగతికి అవరోధం కలిగిస్తాయనే వాతావరణాన్ని సృష్టించేందుకు బాబు తన ‘జాతి’ మీడియాను విడిచిపెట్టి ‘జాతీయ’ మీడియాను ఆశ్రయించాడు.
గత రెండునెలలుగా పరిశీలిస్తే మొట్ట మొదట శేఖర్గుప్తాను రంగంలోకి తెచ్చారు. సోషల్ మీడియాలో ఆయన ఏపీలో మూడు రాజధానులపై పెట్టిన వీడియోలోని అంశాలకు ఎల్లో మీడియాలో ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత జాతీయ పత్రికల్లో సంపాదకీయాలు రాశారంటూ బాబు అండ్ ఎల్లో మీడియా గ్యాంగ్ గగ్గోలు పెడుతోంది. ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ‘ఆర్గనైజర్’ అనే పత్రికలో జగన్ తుగ్లక్ పాలన సాగిస్తున్నారంటూ రాసిన కథనానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రచురించారు.
‘రాయిటర్స్’ అనే వార్తా సంస్థ కియా మోటార్స్‌పై రాసిన కథనాన్ని అడ్డుపెట్టుకుని ఎల్లో మీడియా చేసిన గందరగోళం అంతాఇంతా కాదు. చివరికి రాయిటర్స్ సంస్థ తాము తప్పుడు కథనాన్నిరాశామని ఒప్పుకున్నా, ఎల్లో మీడియా మాత్రం అదే పాట పాడుతుండటం గమనార్హం. తాజాగా ‘ఎకనామిక్ టైమ్స్’ సండే మేగజైన్లో జగన్ సర్కార్ నిర్ణయాలతో పెట్టుబడులకు ప్రమాదం ఏర్పడిందని రాయడం గమనార్హం. అంతేకాదు చంద్రబాబు హయాంలో వాణిజ్యానికి అనుకూల వాతావరణం ఉందని రాయడం వెనుక ఎవరి హస్తం ఉందో చెప్పకనే చెబుతోంది.
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలన్నీ ‘రివర్స్’ చేస్తూ పెట్టుబడిదారులను భయభ్రాంతుల్ని చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు జంకుతుండగా.. ఉన్న పెట్టుబడిదారులు కూడా పారిపోతున్నారు’….. ‘ది ఎకనమిక్ టైమ్స్’ సండే మేగజైన్ కథనం సారాంశం.
‘రాయిటర్స్’, ‘ది ఎకనమిక్ టైమ్స్’లలో వరుస కథనాలు ఎందుకొస్తున్నాయో, వాటికి ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకంత ఆసక్తో ఎవరికీ తెలియంది కాదు. ఎల్లో మీడియాపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహ్యించుకుంటుండంతో, వాటి రాతలకు, కూతలకు విశ్వసనీయత లేదనే ఉద్దేశంతో,,,జాతీయ మీడియాలో రాయించి, ఏదేదో చేయాలనే టీడీపీ కుట్రలను జనం పసిగట్టలేని అజ్ఞానంలో లేరు. కేవలం తమ ఆర్థిక సామ్రాజ్యాలు కూలిపోతున్నాయనే ఓర్వలేని తనం ఈ రాతల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. కాకపోతే జాతీయ మీడియాలో జగన్ సర్కార్‌పై వ్యతిరేక వార్తలు రాయించామన్న ‘తుప్తి’ టీడీపీకి.