అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ నానా బీభత్సంగా జరిగింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు నెగ్గి తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఏ విభాగంలో అయినా బంగ్లాదేశ్ కు ఇదే గొప్ప ఘనత. నాలుగు సార్లు అండర్ 19 ప్రపంచకప్ ను సాధించిన టీమిండియా, డిఫెండింగ్ చాంఫియన్ గా బరిలోకి దిగి ఫైనల్లో ఓటమి పాలయ్యింది. ఆట అన్నాకా.. గెలుపోటములు సహజం. అయితే జంటిల్మన్ గేమ్ క్రికెట్ ను నానా బీభత్సంగా ఆడారు ఈ క్రికెటర్లు.
ఫైనల్ మ్యాచ్ లో పలు సార్లు ఆటగాళ్లు దూషణలకు దిగారు. ముందుగా బంగ్లాదేశ్ బౌలర్లు చీప్ ట్రిక్స్ మొదలుపెట్టారు. తమ బౌలింగ్ లో రెండో ఓవర్ నుంచినే భారత బ్యాట్స్ మన్ ను మాటలతో రెచ్చగొట్టడం ప్రారంభించారు. బౌన్సీ పిచ్ పై బ్యాట్స్ మన్ ఆదిలోనే తడబడాగా.. దాన్ని చూసుకుని బంగ్లా ప్లేయర్లు ఓవరాక్షన్ చేశారు. బంగ్లా బౌలర్లు పదే పదే బ్యాట్స్ మన్ వరకూ వచ్చి వారిని మాటలతో రెచ్చగొట్టడం ప్రారంభించారు.
మరీ తొందరగా ఆ పని మొదలుపెట్టేశారని కామెంటరేటర్లు కూడా వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక తాము గెలిచే సందర్భాల్లో అతిగా రియాక్ట్ అయిపోవడం, ఓడిపోయేటప్పుడు ఏడవడం బంగ్లా వాళ్లకు మామూలే. ఈ క్రమంలో ఓవరాక్షన్ చేశారు. ఇక బంగ్లా బ్యాటింగ్ టైమ్ లో టీమిండియా ఆటగాళ్లు రీవేంజ్ మొదలుపెట్టారు. ప్రత్యేకించి ఇండియా బ్యాట్స్ మన్ ను పదే పదే రెచ్చగొట్టిన బంగ్లా బౌలర్ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు భారత ఆటగాళ్లు అతడిని కవ్వించారు. బంతిని కొట్టాలంటూ కోచింగ్ ఇచ్చారు. చివరకు బంగ్లా నెగ్గింది. కానీ ఆటగాళ్లు మాత్రం మ్యాచ్ అయిపోయాకా కూడా తగ్గలేదు. బంగ్లా విజయోత్సవాలు ఎలా ఉంటాయో ప్రపంచానికి తెలిసిందే.
ఇలాంటి క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లూ కొట్టుకున్నారు. ఇరు వర్గాలూ రెచ్చిపోవడంతో.. కట్టడి చేయడం అంపైర్లకు కూడా కష్టమైంది. మ్యాచ్ అయిపోయాకా.. చేతులు కలపాల్సిన జట్టు ఇలా రచ్చ చేసే సరికి.. గ్రౌండ్ స్టాఫ్ రంగంలోకి దిగి ఇరు వర్గాలనూ విడదీసే పని చేశారు. 19 యేళ్ల లోపు కుర్రాళ్లకు ఆవేశాలు అతిగానే ఉండొచ్చు కానీ.. జాతీయ జట్లను రెప్రజెంట్ చేసే వాళ్లకు కాస్త విజ్ఞత ఉండాల్సింది. బంగ్లా ప్లేయర్లు రెచ్చిగొట్టినా, చీప్ బిహేవియర్ చూపించినా.. భారత ఆటగాళ్లు అయినా జెంటిల్మెన్ లా వ్యవహరించాల్సింది. ఎందుకంటే.. క్రికెట్ కు జెంటిల్మెన్ గేమ్ గా పేరు!