ఇటీవలే కాలం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మంచి నటుడే కాక, గొప్ప రచయిత కూడా. ఆయన పాండిత్యం అపారం. దేశవిదేశాల రచనలను, నాటకాలను, సినిమాలను ఔపోసన పట్టి, వాటిని ఎలా ఎడాప్ట్ చేసుకోవాలో తెలిసినవారు. కథ, నవల, నాటిక, నాటకం, సినిమా ఏదైనా సరే ఆయన అద్భుతంగా రక్తి కట్టించగలరు. ‘‘రాగరాగిణి’’ వంటి ఆయన నాటకాలు అనేకం ప్రసిద్ధి కెక్కాయి. ఆయన విశిష్ఠ నాటికలలో ‘‘కళ్లు’’ ఒకటి. 1975 సాహిత్య అకాడమీ బహుమతి పొందింది. ఇతివృత్తం చిన్నదే. ఐదుగురు గుడ్డివాళ్లు. వారిలో ఒక యువతి సీత, ముగ్గురు యువకులు – రంగడు, రాజీ, కరీం, ఒక పెద్దవయసాయన పెద్దయ్య ఉన్నారు. వీళ్లందరూ దాదాపు పాడుబడిన ఒక గుడి దగ్గర మురికి కాలువకు పక్కగా కాపురం ఉంటున్నారు. ముష్టి ఎత్తుకుని బతుకుతున్నారు. పూజారి బసవయ్య వాళ్లంటే ఆదరం చూపిస్తున్నాడు. వాళ్లకు కావలసిన సరుకును సింహాచలం అనే వ్యాపారి చౌక ధరలకే అందిస్తున్నాడు.
వీళ్లు రకరకాల విద్యలు ప్రదర్శించి డబ్బు సంపాదిస్తున్నారు. ఆ రోజు వీళ్ల దగ్గర కాస్త డబ్బు పోగుపడింది. ఆ ఊళ్లోకి ఒక డాక్టరు వస్తున్నాడు. చూపు వచ్చే అవకాశం ఉన్నవాళ్లకి చూపు తెప్పించగలడు. వీళ్ల దగ్గరున్న డబ్బంతా కలిపితే ఒకరికి చూపు వచ్చే అవకాశం ఉంది. ఎవరాని ఆలోచించారు. కొందరికి పుట్టుకతోనే కళ్లు లేవు, ఇంకోళ్లకి కళ్లల్లో నిప్పురవ్వలు పడి కళ్లు కాలిపోయాయి. ముసలాయన నా జీవితం రాలిపోతోంది, అక్కర లేదన్నాడు. రంగడికి మాత్రం పదేళ్లదాకా కళ్లుండి, కాస్త చదువు నేర్చుకుంటూంటే పిడుగుపాటు వలన చూపు పోయింది. వస్తేగిస్తే అతనికే రావాలి. కానీ రంగడు తనకు చూపు అక్కరలేదన్నాడు. ఇప్పటి బతుకే సుఖంగా ఉందన్నాడు. కానీ అందరూ ఒత్తిడి చేశారు – మాలో కాస్త హుషారైనవాడివి నువ్వే. కళ్లుంటే మా అందర్నీ కాపాడగలవ్ అని బతిమాలాడారు. చివరకు అతను సరేనన్నాడు.
వైద్యం జరిగింది, అతనికి కళ్లు వచ్చాయి. కానీ కళ్లు వచ్చినందుకు రంగడు సంతోషంగా లేడు. ఇన్నాళ్లూ ఎలా గడిపామో అతనికి తెలిసివచ్చింది. చెత్తకుప్పల మధ్య, పాచి పోయిన రొట్టెలు తింటూ, ఘోరమైన పరిస్థితుల్లో బతుకున్నట్లు అర్థమైంది. తన మనుషులంతా మురికిగా ఉంటూన్నట్లు తెలియవచ్చింది. అక్కడ యిమడడం కష్టమనిపించింది. ఇక్కడ మెలోడ్రామా ఎక్కువైంది. వాళ్లకు కళ్లు లేవు కానీ వాసన, రుచి అన్నీ తెలుస్తాయి కదా. మురికి కాలువ నుంచి వచ్చే వాసన తెలియనట్లు, పాచిపోయిన రొట్టెకు, మంచి రొట్టెకు రుచిలో తేడా తెలియనట్లు చూపించారు. ఎక్కడ చెత్తకుప్ప వుందో, ఎక్కడ లేదో తడిమి చూస్తే తెలియదా? కళ్లు వచ్చిన యితనికే యీ తేడాలు తెలిసినట్లు, తక్కినవాళ్లకు తెలియక యింకా అవే స్వర్గం అనుకుంటున్నట్లు చూపించారు.
అంతేకాదు, రంగడు యింకోటి కూడా గ్రహించాడు. తాము యిన్నాళ్లు మంచివాళ్లనుకున్న గుడి పూజారి, వ్యాపారి తమను మోసం చేస్తున్నారని తెలిసింది. ఇతనికి కళ్లు వచ్చి తమను కనిపెడుతున్నాడని తెలియగానే వాళ్లు తక్కినవాళ్లకు చెప్పవద్దంటూ లంచం యిస్తే నిశ్చింతగా పుచ్చుకున్నాడు. అదేమీ తెలియని తక్కిన గుడ్డివాళ్లు రంగడు తమను ఉద్ధరిస్తాడని ఆశ పెట్టుకున్నారు. ‘మీవి మురికి బతుకు, మీతో కలిసి వుండలేను’ అని చెప్పి అతను వేరే చోట ఉండసాగాడు. కొంతకాలానికి వీళ్లను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయసాగాడు. వీళ్లతో పాటు యింకా నకిలీ గుడ్డివాళ్లను పోగేశాడు. వాళ్లకు వచ్చినదంతా తీసేసుకుంటూ, రోజూ క్రమం తప్పకుండా ఏదో కాస్త విదిలిస్తున్నాడు. ఆ ఏరియాలో తక్కిన వాళ్లు ముష్టి ఎత్తకుండా బందోబస్తు చేశాడు.
వీళ్లు తమ త్యాగం వృథా అయినందుకు పెద్దగా బాధపడలేదు. ఎవడో పరాయివాడు దోచుకునే బదులు మనవాడే బాగుపడుతున్నాడు కదా అనుకుని ఊరుకున్నారు. మన కంటె తెలివైనవాడు, మనకు కష్టం వస్తే ఆదుకుంటాడు అనుకున్నారు. కానీ పోనుపోను రంగడి ఆలోచనలు పెడదోవ పట్టాయి. సీత అందం చూసి అనుభవించాలనే కోరిక పుట్టింది. ఆమెకు ఆశ చూపించబోతే ఒప్పుకోలేదు. చివరకు గుడిలోకి తీసుకెళ్లి బలాత్కారం చేయబోతే ఆమె త్రిశూలం చేత చిక్కించుకుని గుడ్డిగా పొడిచేసింది.
తీరా చూస్తే అది రంగడి కళ్లల్లో గుచ్చుకుని అతను శాశ్వతంగా గుడ్డివాడై పోయాడు. సీతపై అత్యాచారం చేయబోయాడని అర్థమయ్యి తక్కినవాళ్లు రంగణ్ని తన్నబోతే అతను గుడ్డివాడై పోయాడనే విషయం తెలిసింది. రంగడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ‘మీరిచ్చిన అర్హతను నిలబెట్టుకోలేక పోయాను. మీ శ్రేయస్సును కాపాడలేక పోయాను. మీరిచ్చిన కళ్లను మీరే తీసుకున్నారు. ఇక్కడ ఉండలేను, వెళ్లిపోతాను’ అన్నాడు. వీళ్లు కరిగిపోయి, ఉండమని బతిమాలారు. ‘క్షమించే గొప్పతనం మీకున్నా దాన్ని భరించే శక్తి నాకు లేదు’ అంటూ అతను వెళ్లిపోయాడు. దీంతో నాటిక ముగిసింది.
కథలా చూస్తే సింపుల్‌గా అనిపించే యీ నాటికలో గొల్లపూడి ప్రజాస్వామ్యం నడుస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు చూపించారు. అసలు మనకు నాయకవ్యవస్థ ఎలా వచ్చింది? ఒక సమూహంలోని ప్రజలు తామెవరికి వారు చిత్తమొచ్చినట్లు ప్రవర్తిస్తే రక్షించుకోవడం కష్టమని భావించి, తమలో బలవంతుడని ఎన్నుకుని, అతన్ని నాయకుడిగా పెట్టుకున్నారు. ‘నువ్వు వేటకి వెళ్లనక్కర లేకుండా మేం వేటాడి తెచ్చినదానిలో వాటా యిస్తాం, నువ్వు అందరినీ కనిపెట్టి ఉంటూ శత్రువు నుంచి రక్షించుకునే మార్గం చూపించు. నీ మాట అందరం శిరసా వహిస్తాం.’ అన్నారు. అదే రాచరికంగా మారి, తర్వాత ప్రజాస్వామ్యంగా పరిణమించింది. మనమంతా ఓట్లేసి నాయకుణ్ని గెలిపిస్తున్నాం. మన సౌఖ్యాలను కొన్ని వదులుకుని, అతనికి వసతులు కల్పిస్తున్నాం. అతను సమర్థుడని, నిజాయితీపరుడనే విశ్వాసాన్ని ఓటు ద్వారా వ్యక్తపరుస్తున్నాం
కానీ ఒకసారి మనకంటె ఉన్నతస్థితికి ఎదిగిన తర్వాత అతనికి తను నడిచి వచ్చిన బాట అసహ్యంగా, తన జనమంతా హీనులుగా ఆనడం మొదలుపెట్టింది. పోనీ పాపమని వాళ్ల బతుకులు బాగుచేస్తున్నాడా? లేదే, అప్పటిదాకా దోచుకుంటున్న వారితో కలిసి దోచుకుంటున్నాడు. వాళ్లని అలాగే ఎదగనీయకుండా ఉంచి, వాళ్లని చూపించి డబ్బు గడిస్తున్నాడు. ఇలాటి వాడికి మనం ఎలాటి శిక్ష వేయాలి? నాటికలో యాక్సిడెంటల్‌గా నైనా కళ్లు వెనక్కి తీసేసుకున్నట్లు, మన విశ్వాసాన్ని ఉపసంహరించుకుని అతన్ని మామూలు స్థితికి తీసుకుని వచ్చేయాలి. అంటే కొన్ని వ్యవస్థల్లో ఉన్నట్లు మనకు ‘రీకాల్’ హక్కు ఉండాలి. ‘నీపై విశ్వాసం పోయింది, నువ్వు ప్రజాప్రతినిథిగా పనికి రావు’ అని చెప్పే సౌకర్యం ఉండాలి. ఇదీ రచయిత యిచ్చే సందేశం.
పేదల్లోంచి పైకి వచ్చినవాడు యింత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని చూపడం బొత్తిగా నాటకీయంగా ఉందనుకోవచ్చు కొందరు. కానీ మానవస్వభావం వింతైనది. అందరూ యిలాగే ఉంటారని చెప్పలేం కానీ కొందరైనా యిలాటి వాళ్లు ఉండరని అనలేం. కార్ల్ మార్క్‌స్ యజమానుల స్వభావాన్ని కరక్టుగానే విశ్లేషించాడు కానీ కార్మికుల స్వభావం దగ్గరకు వచ్చేసరికి పొరబడ్డాడు. ఒకసారి కార్మికులు అధికారంలోకి వస్తే, యజమానులుగా మారితే సాటి కార్మికుల పట్ల ఉదారంగా, న్యాయంగా ఉంటారని ఊహించాడు, ఆశించాడు. మానవస్వభావం ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోయాడు.
యజమానులుగా మారిన కార్మికులు, తరతరాలుగా యజమానులుగా ఉన్నవారి కంటె దారుణంగా కార్మికుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ శ్రమ దోపిడీ చేయగలమని నిరూపించుకున్నారు. ప్రపంచ కార్మికులంతా ఏకమవుతారని, శారీరక శ్రమకు, బౌద్ధిక (బుద్ధికి సంబంధించిన) శ్రమకు మధ్య తేడా చెరిగిపోతుందని మార్క్‌స్ అనేసుకున్నాడు కానీ అవేమీ జరగలేదు. కార్మికులంతా తమలో తాము కలహించుకుంటూనే వున్నారు. వారిలోనూ వర్గాలు ఏర్పడ్డాయి.
తాడిత, పీడిత ప్రజల సంగతి కూడా అంతే. వారిలోంచి ఎదిగినవాడు వారిని ఉద్ధరిస్తాడన్న గ్యారంటీ లేదు. అణగారిన కులాల నుంచి పైకి వచ్చిన నాయకులెందరో తమవాళ్ల బాగోగులు పట్టించుకోరని, వాళ్లతో కలిసి తిరగడం న్యూనతగా భావించి దూరం పెడతారని, వారిని దోపిడీ చేస్తూ వచ్చిన పై కులాల వారితోనే భుజాలు కలుపుతారని ఆరోపణలున్నాయి. తమ కులం నుంచి మరొకడు ఎదిగి తనకు పోటీ రాకుండా, వారిని యథాస్థితిలో ఉంచడానికే ప్రయత్నాలు చేస్తారు.
మన దేశంలో ఎస్సీ నాయకులు అనేకమంది ఉన్నారు. దశాబ్దాల పాటు ఎస్సీ రిజర్వేషన్లు అమలు కాకుండా ఉంటే వీళ్లేం చేశారు? తక్కినవాళ్లూ ఎదిగి వస్తే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందని భయం. హరిజన కార్డుతో ఎంతో ఉన్నతస్థితికి ఎదిగిన జగ్‌జీవన్ రామ్ తన అనుయాయిగా, బిహార్ నుంచి ఎంతమంది హరిజన నాయకుల్ని తయారుచేశారో లెక్క తీయండి చూదాం. తన కొడుక్కి వారసత్వం యిద్దామని చూస్తే అతను త్వరగానే పోయాడు, రాజకీయ వారసత్వం కూతురికి దక్కింది తప్ప పరాయివాళ్లు ఎవరికీ కాదు.
ఈ ‘‘కళ్లు’’ నాటిక ఎంతోమందిని మెప్పించింది. సినిమాగా తీస్తే బాగుంటుందని కె. బాలచందర్ ఆలోచించి కొంత కసరత్తు చేసి, ఒక చిన్న నాటికను రెండుంపావు గంటల సినిమాగా మార్చడం సాహసమే అనుకుని వదిలేశారు. కానీ ప్రముఖ ఛాయాదర్శకుడు ఎం.వి. రఘు తన స్క్రీన్‌ప్లే, ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, దర్శకత్వంతో తెలుగులో ‘‘కళ్లు’’ (1988) సినిమా తీశారు. ఆ సినిమాకు నాలుగు నంది అవార్డులు వచ్చాయి కానీ ఆడలేదు. శివాజీరాజా, రాజేశ్వరి, గుండు హనుమంతరావు వగైరాలు వేషాలు వేశారు. సిరివెన్నెల పాటలు రాసి, ఒక పాట పాడారు కూడా. సంగీతం ఎస్పీది. దానిలో ఒక పాత్ర వేసిన హాస్యనటుడు ‘‘కళ్లు’’ చిదంబరం ద్వారా ఆ సినిమా గుర్తుండి పోయింది. కథకుడిగా నందీ ఎవార్డు వచ్చినా గొల్లపూడికి సినిమా నచ్చలేదు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2020)
[email protected]