స్మార్ట్ ఫోన్ రీచార్జ్ ప్యాక్ లలో ఉన్న పోటీ గురించి వివరించనక్కర్లేదు. ప్రత్యేకించి జియో వచ్చాకా, అదే సమయంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం కూడా బాగా పెరిగాకా ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లు ఇచ్చేస్తున్నాయి టెలికాం కంపెనీలు. ఆ ఆఫర్ల ధాటిలో వెనుకబడిన కొన్ని కంపెనీలు పూర్తిగా మూత దశకు వెళ్లాయి. మరి కొన్ని మాత్రం కొత్త కొత్త రకాల ఆఫర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.
ఇప్పటికే.. ఎయిర్ టెల్ ఈ తరహా ఆఫర్లను అమల్లో పెట్టి చాలా కాలం అయ్యింది. కొన్ని రీచార్జ్ ప్యాకేజ్ లతో ఎయిర్ టెల్ వాళ్లు జీ ఫైవ్ వంటి యాప్ లలో ప్రైమ్ మెంబర్ షిప్ ను ఇస్తోంది. అలాగే ఎయిర్ టెల్ వాళ్లతో ఒక మూవీ యాప్ ఒకటి ఉంది. పరిమిత సంఖ్యలో సినిమాలుంటాయి. ఒకే రీచార్జ్ తో అది కూడా ఫ్రీ!
ఇక జియో కూడా ఈ తరహా ఆఫర్లను ఇస్తోంది. తక్కువ స్థాయి రీచార్జ్ మొత్తానికే డిస్నీ-హాట్ స్టార్ యాప్ లో వీఐపీ మెంబర్ షిప్ ను ఇస్తోంది. అలాగే కొన్ని బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల వాళ్లు కూడా ఈ తరహా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఆ బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లు తీసుకుంటే.. అమెజాన్ ప్రైమ్ తో సహా అన్ని రకాల మూవీ స్ట్రీమింగ్ యాప్స్ మెంబర్ షిప్ ను ఉచితంగా ఇచ్చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కూడా ఆ ఆఫర్ల జాబితాలో కనిపిస్తూ ఉంది.
ఇలాంటి ఆఫర్లు మూవీ స్ట్రీమింగ్ యాప్స్ ను జనాలకు మరింత దగ్గర చేస్తున్నాయని వేరే చెప్పనక్కర్లేదు. ఓటీటీల విషయంలో ఇప్పటికీ కొంతమంది సినిమా వాళ్లు వ్యతిరేకతతోనే ఉన్నారు. ఇలాంటి క్రమంలో అవి జనాలకు మరింతగా చేరువవుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్ల మీద జనాలు పూర్తిగా ఆశలు వదిలేసి పూర్తిగా డిజిటల్ స్ట్రీమింగ్ కే అంకితం అవుతున్నారు. ఇప్పటికే ఇది అలవాటుగా మారుతోంది. ఇదే సమయంలో ఇలాంటి ఆఫర్లు ఆ యాప్స్ ను మరింత మందికి చేరువ చేస్తున్నాయి. చూడబోతే.. ఇదంతా పెద్ద మార్పుకే దారి తీసేలా ఉంది!