సరిగ్గా ఇప్పుడు.. నియమించాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా. ఇక కోర్టుల్లో పిటిషన్లు, మెలికలు అవసరం లేకుండా… ఇప్పుడు హైకోర్టు తీర్పు ప్రకారమో, తెలుగుదేశం కోరిక ప్రకారమో.. నిమ్మగడ్డ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏ వాదన అయితే వినిపిస్తూ ఉందో, ఆ వాదనలో నిజానిజాలు ఇప్పుడు ప్రజల విజ్ఞతలోకి వెళ్లిపోయాయి. నిమ్మగడ్డ రమేష్ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అయితే కావొచ్చుగాక, ఆయనను తొలిగించే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదని కొందరు మేధావులు చెబుతూ ఉంటారు. ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అసహనం కూడా అవసరం లేదేమో!
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వంతో కనీస సంప్రదింపులు కూడా లేకుండా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసేసి మొదట్లో సుప్రీం కోర్టు లో ఇబ్బంది పడ్డారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఎన్నికలు వాయిదా వేస్తే వేశారు.. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడం ద్వారా ఆయన ప్రభుత్వం మీద, అధికారంలో ఉన్న పార్టీ మీద తన ఉద్దేశం ఏమిటో స్పష్టం చేసినట్టుగా అయ్యింది.
ఇక లేఖ వ్యవహారం సరేసరి! ఆ లేఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంతో తయారైందనే ఆరోపణలున్నాయి. ఇక చంద్రబాబు నాయుడి సన్నిహితులతో సమావేశం ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన అవతార కారణాన్ని ఆయనే చాటి చెప్పుకున్నట్టుగా అయ్యిందని ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు!
నిమ్మగడ్డ రమేష్ ఈసీగా వ్యవహరించినా స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అనేది స్పష్టం అవుతోంది. జగన్ సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఏమాత్రం కష్టం కాబోదని స్పష్టం అవుతోంది. స్థానిక ఎన్నికలు ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలు లేవు కూడా. కనీసం నాలుగైదు నెలల పాటు అలాంటి అవకాశాలు లేనట్టే. ఇలాంటి క్రమంలో.. ఇప్పటికే నిమ్మగడ్డ విషయంలో తమ ఆరోపణలకు బలాన్ని సంపాదించి పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పరిణామాల్లో ఇక లాగాల్సిన అవసరం వైసీపీకి లేనట్టే.
ఆయన అంతగా కోరుకుంటున్న పదవి, తెలుగుదేశం వాళ్లు ఆయనే కావాలంటున్న నేపథ్యంలో… ఆయనకే ఆ పదవిని ఇచ్చేస్తే వాళ్ల కోరికా నెరవేరుతుంది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఆపే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కూడా లేరు. ఎలాగూ ఆ ఎన్నికల్లో టీడీపీ చిత్తవుతుంది. నిమ్మగడ్డ కాకుండా మరొకరు ఆ పీఠంలో ఉండగా ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఆ సాకునే తమ ఓటమికి కారణం అనేసి తప్పించుకునే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటి వరకూ అయిన ఎక్స్ పోజ్ తో జనాల కళ్లూ చాలా వరకూ తెరుచుకున్నాయి. ఇలాంటి క్రమంలో.. ఇక తెలుగుదేశం కోరిక మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే ఎస్ఈసీగా నియమించేసి ఎన్నికలకు వెళితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో మెట్టు ఎక్కడం ఖాయం!