“ఈ బాలీవుడ్ కు ఏమైంది.. స్లంప్ లో బాలీవుడ్.. బాయ్ కాట్ బాలీవుడ్.. బాలీవుడ్ కు గ్రహణం..” మొన్నటివరకు చూసిన హెడ్డింగులివి. ఇలా దాదాపు ఏడాది పాటు డౌన్ ఫాల్ చూసిన బాలీవుడ్ లో ఉత్సాహం నింపాడు షారూక్ ఖాన్. అతడు నటించిన పఠాన్ సినిమా, సరైన టైమ్ లో బాలీవుడ్ కు ఆక్సిజన్ అందించింది. ఈ సినిమాతో బాలీవుడ్ పూర్తిస్థాయిలో కోలుకుందని చెప్పొచ్చు.
విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో రికార్డులు బద్దలుకొట్టింది పఠాన్ సినిమా. రొటీన్ స్టోరీ, రెగ్యులర్ స్క్రీన్ ప్లే, మూస ఫైట్స్ తో వచ్చిన ఈ సినిమా, స్టార్ పవర్ ను చాటిచెప్పింది. ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరమైన షారూక్ కు గ్రాండ్ గా వెల్ కం చెప్పాలని బాలీవుడ్ ప్రేక్షకులంతా మూకుమ్మడిగా డిసైడ్ అయి, ఈ సినిమాకు అఖండ విజయాన్నందించారు.
అలా ఈ సినిమా వసూళ్ల పరంగా తాజాగా 400 కోట్ల రూపాయల నెట్ సాధించింది. ఈ ఘనత అందుకున్న తొలి బాలీవుడ్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఇండియాలో బాహుబలి-2, కేజీఎఫ్2 మాత్రమే లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు పఠాన్ మూడో స్థానంలో నిలిచింది. మరో 3-4 రోజుల్లో ఈ సినిమా కేజీఎఫ్2ను క్రాస్ చేస్తుందనే అంచనాలున్నాయి.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల వసూళ్లకు అతి దగ్గరగా ఉంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న విడుదలైన ఈ సినిమాతో షారూక్ ఖాన్ మరోసారి తన సత్తా చాటాడు. చాలా బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
పఠాన్ ఇచ్చిన ఈ స్ఫూర్తి ఇలానే కొనసాగాలంటే, మరిన్ని స్టార్ట్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలోకి రావాలి. అప్పుడు మాత్రమే బాలీవుడ్ కు పునర్వైభవం.