తమ్ముడి మీద అన్నకు ఉన్న అభిమానమో, లేదా సినిమా ఫంక్షన్లో ఒకింత అత్యుత్సాహమో తెలియదు కానీ.. అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పవన్ కల్యాణ్ పేరు చెప్పి అభిమానుల్ని ఖుషీ చేశారు. అంతే కాదు, పవన్ మేనరిజంను చూపించి మరీ ఆడియన్స్ ని ఉత్సాహపరిచారు. అయితే అది ఆ ఫంక్షన్ వరకే హైలెట్. సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవి చేసిన ప్రసంగాన్ని, పవన్ కల్యాణ్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
అర్జున్ సురవరం సినిమాలో చెగువేరాపై ఓ పాట ఉంటుందని, అది చూసినప్పుడు తనకు తమ్ముడు పవన్ కల్యాణే గుర్తుకొచ్చారని సెలవిచ్చారు చిరు. ఇక చూస్కోండి, చిరుని, పవన్ ని అందరూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. అసలు పవన్ కీ చెగువేరాకీ పోలిక ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంకా నయం పవన్ ని చూసి చెగువేరానే స్ఫూర్తిపొందినట్టు చెప్పలేదు అని సెటైర్లు పేలుస్తున్నారు.
చెగువేరాకి కూడా మెడ గోక్కునే అలవాటుందా అని మరికొందరు చెడుగుడు ఆడేసుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం దేశాన్ని కూడా విడిచిపెట్టి వచ్చి కష్టాలు అనుభవించి, చివరికి ఆ సిద్ధాంతం కోసమే అసువులుబాసిన వీరుడు చెగువేరా. మరి పవన్ కల్యాణ్.. జనసేన పేరు చెప్పి, ప్రశ్నిస్తానంటూ ప్రజల ముందుకొచ్చి, చంద్రబాబుతో లాలూచీ పడి, ప్యాకేజీలతో సర్దుకుని కేవలం జగన్ ని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడే జలసీ స్టార్.
చెగువేరా డాక్టర్, పవన్ కల్యాణ్ డాక్టర్ చదవాలనుకుని మ్యాథ్స్ మెయిన్ సబ్జెక్ట్ గా తీసుకునే మేథావి. చెగువేరా ఎప్పుడూ అధికారం కోసం ఆరాపటపడలేదు, పదవుల్ని తృణప్రాయంగా త్యాగం చేసిన నిస్వార్థపరుడు. గెరిల్లా పోరాటంలో ఆయన కోసం వందలాది మంది ప్రాణాలర్పించడానికి సైతం సిద్ధపడ్డారు. పవన్ కనీసం తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ గెలవలేకపోయారు. అసలు చేగువేరాకీ, పవన్ కీ పోలికేంటి? చేగువేరాతో పవన్ ని పోల్చే సాహసం ఏంటి?
అసలే ఇంగ్లిష్ మీడియం విషయంలో పవన్ కల్యాణ్ పై విపరీతంగా సెటైర్లు పడుతున్నాయి. పాత ప్రసంగాల్ని వెలికి తీసి మరీ పవన్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు చెగువేరాతో పోల్చడం కూడా విమర్శకులకు మరింత పని చెప్పింది. చిరంజీవి కూడా ఈ రేంజ్ లో విమర్శలు వస్తాయని అనుకున్నట్టు లేరు. లేకపోతే అసలు పవన్ ప్రస్తావనే తెచ్చి ఉండేవారు కాదేమో. పొరపాటున పవన్ పేరు తెచ్చి తమ్ముడ్ని మరింత తిట్టిస్తున్నారు చిరంజీవి.