సమీక్ష సమావేశాలంటూ చంద్రబాబు నాయుడు కడప పర్యటనకు వెళ్లగా.. అక్కడ ఆయన కార్యకర్తలకు సుత్తి వేయడం ఏమిటో కానీ, కార్యకర్తలే చంద్రబాబుకు రివర్స్ లో సుత్తి వేశారట! అయినా చంద్రబాబు నాయుడు హయాంలో కడపలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పొడిచింది ఏమీ లేదు. మహా అంటే ఒకటీ రెండు నియోజకవర్గాల్లో విజయమే గగనం. అలాంటి చోట.. జగన్ సునామీలో తెలుగుదేశం మరింత చిత్తు అయ్యింది. భారీ ఓట్ల తేడాతో ఓడిపోయింది.
చంద్రబాబు మార్కు రాజకీయాలను రాయలసీమ ప్రజలే అసహ్యించుకున్నారు. అందుకే స్వయంగా ఆయనకే మెజారిటీ తగ్గిపోయింది. రాయలసీమ నాలుగు జిల్లాలకు గానూ తెలుగుదేశం గెలిచింది మూడు సీట్లలో అంటే చంద్రబాబు మార్కు పాలనను, ఆయన రాజకీయాన్ని సీమ ప్రజలు ఏ రేంజ్ లో అసహ్యించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి క్రమంలో చంద్రబాబు నాయుడు కడపకు సమీక్షకు వెళ్లడమే కామెడీ. అయితే అధినేతగా తను ఉన్నందు వల్ల ఏదో ఒకటి చేయాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈ పర్యటనలు పెట్టుకున్నట్టుగా ఉన్నారు.
ఇలాంటి క్రమంలో కడపలో చంద్రబాబు నాయుడి సమావేశంలో తెలుగుదేశం కార్యకర్తలు ఆయనను కడిగేసినంత పని చేశారని సమాచారం. 'అంతా మీరే చేశారు..' అంటూ చంద్రబాబుకు తలంటారట తమ్ముళ్లు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, సీఎం రమేశ్ వంటి వ్యాపారస్తుడికి సర్వం అప్పజెప్పడం, ఆదినారాయణ రెడ్డి అంతా తానై వ్యవహరించడం.. వారికి మీరు వంత పాడటం.. ఇవన్నీ పార్టీ ఇంతలా చిత్తైపోవడానికి కారణమంటూ చంద్రబాబుకు క్లాస్ వేసుకున్నారట తెలుగు తమ్ముళ్లు. వాళ్లు తనను ఇరకాటంలో పెడుతుండే సరికి చంద్రబాబు నాయుడు ఒక దశలో వారిపై అసహనం వ్యక్తం చేశారట. చంద్రబాబుకు ఇలాంటి సమీక్షలు పడవు. ఓటమికి బాధ్యత ఆయన తీసుకునేటైపు కాదు. ఓటమికి బాధ్యత తీసుకునే వాళ్లు చంద్రబాబుకు కావాలి.
గతంలో అలాంటి సమీక్షలే ఆయన చేశారు. తను అంతా బాగా చేసినట్టుగా, ఎమ్మెల్యేల వల్ల, నేతల వల్ల ఓడినట్టుగా చెప్పుకోవడం చంద్రబాబుకు రొటీనే. ఓడిపోయిన ప్రతిసారీ అవే మాటలే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా చంద్రబాబు కనబరిచే ఆ తీరుపై విసుగు ధ్వనిస్తున్నట్టుగా ఉంది!