తన బర్త్ డేకు తను కేక్ కూడా కోసేది ఉండదని సినిమా హీరో పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పాడు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు. అది పవన్ అభిమానులే కాదు.. ఏ సినిమా హీరో అభిమానులు కూడా అర్థం చేసుకోలేని అంశం. దశాబ్దాలుగా తెలుగునాట, తమిళనాట ఈ సినీ హీరోలపై వీరాభిమానం కొందరి ప్రాణాలను తీస్తూనే ఉంది. తెలుగు, తమిళులను చూసి ఈ మధ్య కన్నడీగులు కూడా అంతే ఓవరాక్షన్ నేర్చుకున్నారు.
తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతోందంటే.. ఫ్లెక్సీలు కట్టడానికనో, కటౌట్ లను ఏర్పరచడానికనో వెళ్లి కరెంటు తీగలకు తగిలో, మరో కారణం చేతనో ప్రాణాలు పోగొట్టుకున్న వీరాభిమానుల వార్తలు తరచూ వస్తూనే ఉంటాయి. కనీస అవగాహన లేకుండా.. వీరాభిమానాన్ని ప్రదర్శించబోయి ఇలాంటి వారు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్ తీగలకు తగిలి ఏకంగా ముగ్గురు మరణించారు. 25 అడుగుల ఎత్తు ఫ్లెక్సీని వారు ఏర్పాటు చేయబోయారట!
25 కాదు, 50 అడుగుల ఫ్లెక్సీని ఏర్పాటు చేసినా.. వారికి దక్కేది ఏమిటి? తన పుట్టిన రోజు తనే సంబరంగా చేసుకోనంటూ పవన్ కల్యాణ్ చెబుతుంటే, ఇలా అభిమానులు ఈ తరహలో హంగామా చేయాల్సిన అవసరం ఎంత? చేస్తే చేశారు.. కాస్తైనా జాగ్రత్తలు పాటించాలి కదా. ఆ కుటుంబాల గర్భ శోకం ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు వంద జరిగితే కానీ తీరుతుందా? ఆ వీరాభిమానుల పిల్లలో, వారిపై ఆధారపడిన వారి పరిస్థితి ఏమిటి? సానుభూతి వచనాలు వారి లోటును తీరుస్తాయా?
సినీ అభిమానం తెలుగునాట వక్రపుంతలు తొక్కి చాలా కాలం అవుతూ ఉంది. ఈ వీరాభిమానంతో కొందరు ప్రాణాలనూ కోల్పోతున్నారు. అభిమానం ఉండొచ్చు, దానికీ హద్దులు ఉండాలి. కనీసం సొంత ప్రాణాల మీద అయినా దృష్టిలో ఉంచుకోవాలి సినీ వీరాభిమానులు.