వయసు పెరిగేకొద్దీ తన పాత్రలు, కథల ఎంపికలో చాలా మార్పుచేర్పులు చేసుకుంటూ వచ్చారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలో ఫ్లాపులొచ్చినా పట్టించుకోలేదు. కొన్ని మేనరిజమ్స్ కు కూడా దూరమయ్యారు. ఇదే విషయాన్ని ఆయన గతంలో ఓసారి వెల్లడించారు కూడా. ఈ వయసులో ఖుషీ, తమ్ముడు లాంటి సినిమాలు చేయలేనన్నారు. కానీ అతడి అభిమానులు మాత్రం ఇప్పటికీ ఖుషీ, తమ్ముడు లాంటి సినిమాలే కావాలని కోరుకుంటున్నారు.
వరుస ఫ్లాపుల తర్వాత గబ్బర్ సింగ్ తో సక్సెస్ అందుకున్నారు పవన్. ఆ సినిమా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అందులో వింటేజ్ పవన్ కనిపించడమే. ఆ చిలిపితనాన్ని అంతా ఇష్టపడ్డారు. అయితే పవన్ మాత్రం ఎప్పటికప్పుడు తన మైండ్ సెట్ కు తగ్గట్టు కథలు ఎంచుకున్నారే తప్ప, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకోలేదు.
ఇప్పుడు మరోసారి పవన్ సినిమాల ఎంపికలో భారీ మార్పులు కనిపించే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఇప్పుడాయన కేవలం నటుడు మాత్రమే కాదు, ఎమ్మెల్యే కూడా. పైగా ఓ పార్టీకి అధినేత. కాబట్టి ఈసారి ఆయన మేకర్స్ కు మరిన్ని కండిషన్స్ పెట్టొచ్చు.
ఆయన కండిషన్స్ పెట్టినా పెట్టకపోయినా, మేకర్స్ మాత్రం ముందే ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. పవన్ స్థాయికి తగ్గట్టు లార్జర్ దేన్ లైఫ్ స్టోరీలు రెడీ చేసే పనిలో పడ్డారు కొంతమంది. దీంతో ఆయన తన మేనరిజమ్స్, స్టయిల్ కు మరింత దూరం జరిగే ప్రమాదం ఉంది.
ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం చేస్తున్న సినిమాల్ని పక్కనపెడితే, భవిష్యత్తులో పవన్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.