జారుకుంటున్నారు.. జాగ్రత్త జగన్!

అవకాశం వస్తే దండుకుందాం అని గోతికాడ నక్కలు పొంచి ఉంటాయి. నక్కలు మాత్రమే కాదు, కొందరు నాయకులు కూడా అంతే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది వారి విషయంలో చాలా చిన్నమాట.…

అవకాశం వస్తే దండుకుందాం అని గోతికాడ నక్కలు పొంచి ఉంటాయి. నక్కలు మాత్రమే కాదు, కొందరు నాయకులు కూడా అంతే. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనేది వారి విషయంలో చాలా చిన్నమాట. కప్పల తక్కెడ కంటె ఘోరంగా, గోడమీది పిల్లుల్లా అటూ ఇటూ గెంతుతూనే జీవితం మొత్తం గడిపేస్తారు. మామూలు సందర్భాల్లో పార్టీని వీడి వెళ్లడం వేరు! కానీ పార్టీ కొంచెం కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో, ఏమాత్రం నైతిక విలువలు లేకుండా.. పార్టీ కష్టాల్లో పడిన వెంటనే పలాయనం చిత్తగించి ఫిరాయించేసేవాళ్లు కూడా ఉంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం అనేది దారుణమైన పరాజయమే. నిజానికి ఇలాంటి క్లిష్ట సమయాల్లోనే కదా.. పార్టీకి నాయకులు అండగా ఉండాల్సింది. పార్టీని సరైన రీతిలో పునర్నిర్మించుకోవడంలో అధినేతకు తోడుగా ఉండాల్సింది. కానీ.. ఇలాంటి సమయంలోనే కొందరు అవకాశవాద నాయకులు పార్టీని వదలివెళ్లిపోతున్నారు.

తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు నిష్క్రమించారు. వైసీపీనుంచి బయటకు వెళ్లడమే తడవుగా చంద్రబాబునాయుడు భజన ప్రారంభించారు. గతంలో చంద్రబాబు ప్రజాసేవకు అద్భుతమైన అవకాశం ఇచ్చారని, ఆయన వద్ద మంత్రిగా పనిచేసినా కూడా బయటకు వచ్చానని చెప్పకున్నారు.

చంద్రబాబునాయుడు గద్దె ఎక్కగానే మళ్లీ ఆయన పంచన చేరడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. రావెల మాత్రమే కాదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఓడిపోబోతున్నదనే సంగతిని ముందుగానే గ్రహించిన తెలివైన సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ కూడా ఏప్రిల్లోనే పార్టీని వదలిపోయారు. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన ఈ ఫిరాయింపు నాయకుడికి జగన్ సగౌరవంగా ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు. అయినా సరే కనీస కృతజ్ఞతలేకుండా వెళ్లిపోయారు.

ఇలాంటి అవకాశవాద నాయకుల పట్ల జగన్ అప్రమత్తంగా ఉండాలని, పార్టీలో మిగిలిన వారిలోనూ ఇలాంటి గోతికాడనక్కలు చాలా ఉన్నాయని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.