తమ అభిమాన హీరోని విమర్శించాడంటూ టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ దాడికి ప్రయత్నించారు. మంగళవారం సాయంత్రం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వద్ద ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోసాని ప్రెస్ మీట్ గురించి సమాచారం అందుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆయనపై దాడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకుని కొంతమంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ను అదుపులోకి తీసుకుని, పంజాగుట్ట పోలిస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పోసానిని పోలీసు వాహనంలోనే ఆయన ఇంటికి తరలించారు.
తమ అభిమాన హీరోపై ఎలాంటి విమర్శలు వచ్చినా ఈ తరహాలో తీవ్రంగా స్పందించడం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గా చెప్పుకునే వారికి కొత్త కాదు. ఇది వరకూ కూడా ఇలాంటి ఉదంతాలున్నాయి. ఇలాంటి క్రమంలో పోసాని తాజా బాధితుడు అయ్యాడు.
ఒకవైపు పవన్ కల్యాణ్ తనకు నచ్చని వారిపై తీవ్రంగా స్పందిస్తాడు. వాళ్ల తాట తీస్తానంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఏపీ మంత్రి ఒకరిని ఉద్దేశించి సన్నాసి అంటూ కూడా వ్యాఖ్యానించాడు పవన్ కల్యాణ్. యాక్షన్ కు తగ్గట్టుగా రియాక్షన్ సహజం.
రాజకీయాల్లో అది తీవ్రంగా ఉంటుంది కూడా. మరి పవన్ మాటలపై పోసాని కౌంటర్ ఇవ్వడంలో వింత ఏమీ లేదు. పవన్ కల్యాణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆయన భాషలోనే సమాధానం ఇస్తున్నారు. దీన్ని పవన్ ఫ్యాన్స్ సహించలేకపోతున్నట్టుగా ఉన్నారు.
ఈ క్రమంలో వారు భౌతిక దాడులకు కూడా వెనుకాడరని మరోసాని స్పష్టం అవుతూ ఉంది. ప్రజాస్వామ్యిక వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీని పెట్టుకున్న పవన్ కల్యాణ్ ఇలా అభిమానుల ముసుగులో చేసే దాడులను సమర్థిస్తారో, లేక ఖండిస్తారో ఆయనకే తెలియాలి. తనను ఎవరైనా ఏమైనా అంటే తన అభిమానులు ఇలానే స్పందిస్తారని పవన్ కల్యాణ్ భావిస్తే మాత్రం.. అది సమంజసం అనిపించుకోదు.
గతంలో చిరంజీవి పై ఒక టీవీ చానళ్లో జీవితా-రాజశేఖర్లు విమర్శలు చేయగా.. వారిపైన చిరంజీవి అభిమానులు దాడికి పాల్పడ్డారు. అప్పుడు చిరంజీవి హుందాగా స్పందించి, తనే రాజశేఖర్ ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆ పనికిమాలిన దాడిని ఖండించారు. అయితే పవన్ నుంచి ఇలాంటివి ఎక్స్ పెక్ట్ చేయడానికి లేదేమో!