Advertisement

Advertisement


Home > Movies - Movie News

సింపతీ ముసుగులో పవన్ పొత్తు ప్రకటన

సింపతీ ముసుగులో పవన్ పొత్తు ప్రకటన

ఢిల్లీ టూర్ తర్వాత పవన్ కల్యాణ్ ఆ విశేషాలు తెలియజేయడానికి కచ్చితంగా ఓ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటాం, భవిష్యత్ లో కలసి ప్రయాణం చేస్తాం అని చెప్పడానికి పవన్ మీడియా ముందుకొచ్చినా, జనసైనికులతో కలసి సమావేశం ఏర్పాటు చేసినా.. కచ్చితంగా ప్రతికూల వాతావరణం ఏర్పడి ఉండేది. మీడియా నుంచి కానీ, కార్యకర్తల నుంచి కానీ వచ్చే ప్రశ్నలకు పవన్ ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు, జనసైనికుల ఆగ్రహానికి గురయ్యేవారు.

అందుకే తెలివిగా ఆ ఆవేశాన్ని కాకినాడకు మళ్లించారు పవన్. బీజేపీతో కలసి వెళ్తాం, ఆ లాంఛనాన్ని పండగ పూర్తయ్యాక అధికారికంగా ప్రకటిస్తాం.. అని చెప్పేందుకు కాకినాడ వేదిక చేసుకున్నారు. కాకినాడలో జనసైనికులపై దాడి జరిగిందని, వైసీపీ రౌడీయిజం చేస్తోందనే ఉద్విగ్న, ఉద్వేగ పరిస్థితులున్నాయంటూ బాధితులకు బాసటగా వెళ్లే సరికి అసలు విషయాన్ని జనసైనికులు పెద్దగా పట్టించుకోలేదు.

ఢిల్లీలో బీజేపీ నేతల కాళ్లకు మొక్కి, కాకినాడలో కాలరెగరేసిన కాటమరాయుడు అనుకున్నట్టుగానే జనాన్ని ఏమార్చారు. వాస్తవానికి ఢిల్లీలో జరిగిన వ్యవహారాలపై అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించినా, నేరుగా విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పొత్తు ప్రకటన చేసినా జనసైనికుల నుంచి తీవ్ర నిరసనలు వచ్చి ఉండేవి. ఇవేవీ లేకుండా తప్పించుకోడానికే పవన్ కాకినాడలో సింపతీ డ్రామాకి తెరలేపారు. వైసీపీని తీవ్రంగా విమర్శించి జనసైనికుల్లో పూనకం వచ్చిన తర్వాత మెల్లగా బీజేపీ పొత్తుపై పెదవి విప్పారు.

ఈనెల 16న 11 గంటల శుభ మహూర్తానికి బీజేపీతో కలసి వెళ్లే నిర్ణయంపై కీలక ప్రకటన చేస్తామని చావు కబురు చల్లగా చెప్పారు. జనసైనికుల గుండెల్లో గునపం గుచ్చారు. ఇలా చెప్పుకోడానికి పవన్ కల్యాణ్ కి సిగ్గువేయకపోయినా ఆ మాటలు విన్న జనసైనికుల గుండెలు పగిలాయి. మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధం అయితే ఎంత బాగుండు అనుకున్నవారంతా.. నేరుగా జనసేనాని నోటి నుంచే ఆ మాట బైటకొచ్చేసరికి హతాశులయ్యారు.

ఇక చేసేదేముంది, ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ మరోసారి నోరు మూసుకుంటున్నారు, తోలు తీస్తాం, తాట తీస్తామన్న గబ్బర్ సింగ్ మరోసారి బీజేపీ ముందు తీన్ మార్ ఆడేందుకు సిద్ధమయ్యారు. చివరిగా దారుణంగా మోసపోయింది మాత్రం జనసైనికులే. ఈ విషయంలో ప్రజలు చాలా ముందు జాగ్రత్తతో వ్యవహరించారు. గత ఎన్నికల్లోనే పవన్ ను పక్కనపెట్టారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?