రాష్ట్ర విభజన అనంతరం రాజధానిపై అధ్యయనానికి నాటి యూపీఏ-2 సర్కార్ నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ఏ మంటల్లో తగలబెట్టారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.
రాజధానిపై అధ్యయనానికి జగన్ సర్కార్ జీఎన్ రావు కమిటీని, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీని నియమించింది. ఈ రెండు కమిటీలు ఇటీవల జగన్ సర్కార్‌కు నివేదికలు సమర్పించాయి. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణకు ఆ రెండు కమిటీల నివేదికలు మొగ్గు చూపాయి. అలాగే పరిపాలనా రాజధాని, న్యాయ సంబంధ రాజధాని వేర్వేరు ప్రాంతాల్లో పెట్టుకోవచ్చని సూచించాయి. శ్రీబాగ్ ఒడంబడిక అమలు కోసం రాయలసీమ చేస్తున్న డిమాండ్లను తెరపైకి తెచ్చారు.
ఈ నేపథ్యంలో అమరావతి రైతులు ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహించారు. రోజుకో రూపంలో రాజధాని రైతుల ఆందోళన సాగుతోంది. సంక్రాంతి పండుగలో భాగంగా భోగిని పురస్కరించుకుని భోగి మంటల్లో జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను తగలబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడ బెంజి సర్కిల్‌లో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన భోగి మంటల కార్యక్రమంలో జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలను చంద్రబాబు తగలబెట్టారు.
అయితే ఐదేళ్ల క్రితం శివరాకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ఏ మంటల్లో కలిపారని ఏపీ పౌరసమాజం ప్రశ్నిస్తోంది. ఆ రోజు శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అమలు చేసి ఉంటే …నేడు ఈ పరిస్థితులు తలెత్తేవి కాదు కదా అని మండిపడుతోంది. నాడు తన కేబినెట్‌లోని మంత్రి నారాయణ నేతృత్వంలో టీడీపీ వ్యాపారస్తులతో నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజధాని ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడడాన్ని ఏపీ ప్రజలు గుర్తు చేస్తున్నారు. తాను చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అనే ధోరణి ఇప్పటికైనా విడనాడి…రాష్ట్ర ప్రజలకు, రాజధాని రైతులకు ప్రయోజనం కలిగించే చర్యలు తీసుకుంటే మంచిదని బాబుకు సూచిస్తున్నారు.