టీడీపీ అధినేత చంద్రబాబును జనసేనాని పవన్‌కల్యాణ్ మోసగించారా? అవునని టీడీపీ వర్గాలు వాపోతున్నాయి. మోసగించడమే తప్ప మోసపోవడం బాబు 40 ఏళ్ల పొలిటికల్ హిస్టరీలోనే లేదు కదా అని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. బీజేపీకి జనసేన దగ్గర కావడం టీడీపీకి ఏ మాత్రం రుచించడం లేదు. పైకి ఏమీ మాట్లాడకపోయినా…పవన్‌పై టీడీపీ శ్రేణులు లోలోపల రుసరుసలాడుతున్నాయి. గత కొంత కాలంగా తమకు అనుకూలంగా ఉన్నట్టే వ్యవహరిస్తూ, గుట్టు చప్పుడు కాకుండా బీజేపీ పంచన చేరడం ఏంటని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఘోర ఓటమిని చవి చూశాయి. మూడు రోజుల క్రితం రాజధానిలో జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీడీపీ, జనసేన వేర్వురుగా పోటీ చేయడం వల్లే వైసీపీ అత్యధిక స్థానాలు సాధించిందని నాయకులు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని కొందరు, వద్దని మరికొందరు అన్నట్టు వార్తలొచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయని అందరూ భావించారు.
ఆ సమావేశం జరిగిన రోజే జనసేనాని పవన్ ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో ఆయన చర్చించారు. రానున్న రోజుల్లో ఒకే ఎజెండాతో ఏపీలో పోరాటాలు చేయడంతో పాటు అన్ని ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని సూత్రప్రాయంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న విజయవాడలో ఆ రెండు పార్టీల మధ్య కీలక సమావేశం జరగనుంది.
బీజేపీతో జనసేన కలవడాన్ని టీడీపీ జీర్ణించుకోలేకుండా ఉంది. పవన్‌ను ఎలాగైనా తమ వైపు తిప్పుకుంటే కాపుల ఓట్లతో అధికారాన్ని దక్కించుకోవచ్చని చంద్రబాబు భావించారు. కానీ బాబు ఒకటి తలిస్తే, జనసేనాని మరొకటి తలచారు. ఏ చిన్న అవకాశం వచ్చినా పవన్‌ను మచ్చిక చేసుకునేందుకు బాబు పడిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైందని టీడీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పవన్‌కు సంబంధించి అన్ని కార్యక్రమాలు తమ అనుకూల మీడియాలో బాగా హైలెట్ అయ్యేలా టీడీపీ ప్లాన్ చేసింది. తమను నమ్మించినట్టే పవన్ నటిస్తూ చివరికి బీజేపీకి షేక్‌హ్యాండ్ ఇచ్చాడని ఆ శ్రేణులు వాపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితే లేదని బీజేపీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.