రాజధాని అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న యాగీ అంతాఇంతా కాదు. సీఎం జగన్‌పై అవాకులు చెవాకులు పేలుతున్నారు. కానీ జగన్ నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. బహుశా జగన్ సహనానికి రాజధాని ఓ అగ్నిపరీక్ష అనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్సైడర్ ట్రేడింగ్, రాజధానిపై రెఫరెండానికి డిమాండ్, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ జోలె పడుతూ విరాళాల సేకరణ తదితర కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా జగన్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. కానీ జగన్ మౌనమే తన భాష అని అన్నీ చూస్తూ, వింటూ ఉన్నాడు.
గత నెల 17న అసెంబ్లీలో రాజధానిపై మాట్లాడటం మినహా మరెక్కడా ఆ అంశం గురించి ప్రస్తావించలేదు. అసెంబ్లీలో ప్రకటన తర్వాత విశాఖ ఉత్సవాలకు ఆయన వెళ్లాడు. ఆయనకు ఉత్తరాంధ్ర ప్రజలు ఘన స్వాగతం పలికారు. విశాఖలో జగన్ ఏం మాట్లాడుతారోనని రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూశారు.
కానీ ఆయన వ్యూహాత్మకంగా ఉత్సవాల ప్రారంభానికే పరిమితమై ఏమీ మాట్లాడకుండా వెనుతిరిగాడు. ఆ తర్వాత ఏలూరులో ఆరోగ్యశ్రీ ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభానికి వెళ్లాడు. గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేసిందని, వాటిని తమ ప్రభుత్వం సరిదిద్దుతుందని చెప్పాడు. అంతేకాకుండా అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్నాడు. అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలు బాగుండాలని రాజధానిపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.
ప్రతిపక్ష నాయకుల విషయానికి వస్తే చంద్రబాబు, పవన్‌కల్యాణ్, కన్నా లక్ష్మినారాయణ, సీపీఐ నారాయణ, రామకృష్ణ తదితరులంతా జగన్‌పై ఇష్టానుసారం విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఇచ్చే కౌంటర్లకు మీడియాలో పెద్దగా చోటు దక్కకపోవడంతో….ఇంత వరకూ వన్‌సైడ్‌గానే సాగుతోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ ఇలాగే వ్యతిరేకించాయి. జగన్‌పై ప్రతిపక్ష పార్టీల నాయకులంతా చెలరేగిపోయారు. కానీ జగన్ ఒకే ఒక్క ప్రశ్న ‘ఇంతకూ మీ పిల్లలంతా ఏ మీడియంలో చదువుతున్నారు’ అని సంధించి అందరి నోళ్లు మూయించారు. చివరికి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు కూడా ఆంగ్ల మాధ్యమానికి మద్దతు పలకడం గమనార్హం.
ప్రస్తుతం రాజధానిపై కూడా సీఎం జగన్ ఎంతో కసరత్తు చేసే ఒక నిర్ణయానికి వచ్చాడు. విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపునకు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిలే జగన్ పర్యవేక్షిస్తున్నాడు. ఒక వైపు ప్రతిపక్షాల మాటలు, ఆటలను ఆయన గమనిస్తూ…సమాధానం చెప్పే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ నెల 20న అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేసే చర్చలో భాగంగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో తీవ్రస్థాయిలో ఎదురు దాడి చేసేందుకు ఆయన అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాడు. ఐదు రోజుల్లో జగన్ అసెంబ్లీ వేదికగా మొదలు ఎదురు దాడికి సిద్ధమయ్యాడు.
అసెంబ్లీ కేంద్రంగా ప్రతిపక్షాలపై జగన్ ఎదురు దాడి ఓ తుపాను సృష్టించే అవకాశాలున్నాయి. ఈ తుపాను కొన్నిరోజుల పాటు కొనసాగే అవకాశాలున్నాయి. ఈ తుపాను విశాఖలో తీరం దాటే వరకు సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజధానిపై జగన్ ఎదురు దాడి తుపానులో బాబు సహా కొట్టుకుపోయే వారు ఎందరో చూడాలి మరి.