తెలంగాణ లో స్థానిక ఎన్నికల నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారని, జగన్ కు సఖ్యతగా ఉంటూ.. తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల ఓట్లను పొందడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని టీ కాంగ్రెస్ ముఖ్య నేత పొన్నాల లక్ష్మయ్య వాపోయారు. తెలంగాణ రాజకీయం విషయంలో ఈ విశ్లేషణలు బయటి వారి నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలోని వైఎస్ అభిమానులను, రెడ్లను చల్లబరిచి వారి ఓట్లను పొందేందుకే జగన్ కు కేసీఆర్ మరోసారి పెద్ద పీట వేశారని తెలుగుదేశం అనుకూల మీడియా కూడా విశ్లేషిస్తూ ఉంది. అలాగే జగన్ పాలనను కేటీఆర్ పొగడటంలో కూడా ఈ కోణం ఉందని పచ్చ మీడియా చెబుతూ ఉంది.
ఏదేమైనప్పటికీ.. వీళ్లందరికీ వైఎస్ విలువ మాత్రం ఇప్పుడు తెలుస్తోందని అనుకోవాలి. ఆయన చనిపోయిన వెంటనే ఆయన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఆయన విలువను తెలుసుకోలేకపోయారు. వైఎస్ పాలనలో ఆయనను భోజుడుతోనూ, రాయలుతోనూ పోల్చిన వారిలో ఈ పొన్నాల కూడా ఉన్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించాకా.. కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన విషయంలో అనుచితంగా మాట్లాడితే, చనిపోయిన ఆయన పేరును సీబీఐ చార్జి షీట్లో పెడితే, ఆయన మంత్రులుగా
వ్యవహరించి కూడా పొన్నాల వంటి వారు స్పందించలేకపోయారు.
పరమ అవకాశవాదులుగా వ్యవహరించారు. వైఎస్ కేబినెట్లో పని చేసిన ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే.. చాలా మంది అప్పుడు పరమ దుర్మార్గంగా వ్యవహరించారు. అందుకు అనుగుణంగా చాలా మంది రాజకీయంగా తెరమరుగు కూడా అయిపోయారు. ఇక తమకు వైఎస్ ఇమేజ్ ఓట్లు తెచ్చిపెడుతుందనే ఇంగిత జ్ఞానం కూడా అప్పుడు కాంగ్రెస్ వారికి లేకపోయింది. తాము సోనియా, రాహుల్ పేరుతో గెలిచామనే అబద్ధాన్ని వారు నమ్మించడానికి ప్రయత్నించారు. చివరకు ఏమైందో తెలిసిందే.
తనతో వచ్చిన ఏపీ కాంగ్రెస్ నేతలను అయినా జగన్ ఒడ్డున పడేశారు. అదే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇప్పటికీ దిక్కూదివాణం లేదు. ఇప్పుడు జగన్ ను తమ నాయకుడిగా ప్రకటించుకుని.. వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరిపోతే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందేమో! అలా చేయకుంటే..కాంగ్రెస్ గతి ఎప్పటికీ ఇలానే ఉంటుందేమో! అవతల బీజేపీ తెలంగాణ విషయంలో ప్రణాళికలు వేస్తూ ఉంది. ఇవతల కేసీఆర్ వైఎస్ ఫ్యాన్స్ కు ఇలాంటి గాలం వేస్తూనే ఉండవచ్చు. ఏదేమైనా వైఎస్ బొమ్మ తమకు అవసరం లేదన్నట్టుగా అప్పుడు అతి చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు మళ్లీ వైఎస్ ఇమేజ్ కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండటం.. గమనార్హం.