తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని ప్రకటించుకుంది అల వైకుంఠపురంలో యూనిట్. ఆ మేరకు తమ సినిమా విడుదల అయిన మరుసటి రోజే పత్రికా ప్రకటనలు ఇచ్చుకుంది. సంక్రాంతి సినిమాల్లో తమదే విన్నర్ అని వారు ప్రకటించుకున్నారు. మీడియాకు ఇచ్చే యాడ్స్ లో 'సంక్రాంతి విన్నర్' అంటూ తమ సినిమాకు ట్యాగ్ తగిలించారు. అయితే అందులో కొంత తొందరతనం ఉంది. సంక్రాంతికి షెడ్యూల్ అయిన సినిమాలు పూర్తిగా విడుదల కాకుండానే.. తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని ఆ యూనిట్ ప్రకటించుకుంది.
ఆ సంగతలా ఉంటే.. ఆ ట్యాగ్ కు కౌంటర్ గా మరో ట్యాగ్ ను వదిలింది సరిలేరు నీకెవ్వరూ యూనిట్. మొదటి రోజు తమ సినిమా సూపర్ హిట్ అని ప్రకటించుకున్న ఈ సినిమా రూపకర్తలు ఇప్పుడు తమ సినిమాకు ట్యాగ్ లైన్ మార్చారు. 'రియల్ సంక్రాంతి విన్నర్' అట. ఈ సినిమాకు ఇప్పుడు ఈ ట్యాగ్ ను తగిలించారు.
అల యూనిట్ ఏమో తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని ప్రకటించుకుంటుంటే, సరిలేరు యూనిట్ మాత్రం తమ సినిమా రియల్ సంక్రాంతి విన్నర్ అంటున్నారు. ఇలా అల వైకుంఠపురంలో రూపకర్తలకు సరిలేరు రూపకర్తలు కౌంటర్ ఇచ్చారని అనుకోవాలి. వాళ్లది ఫేక్ ప్రకటన అని, తమది రియల్ ప్రకటన అన్నట్టుగా వీళ్లు ప్రకటించుకున్నారు. విడుదల తేదీ తో సహా వివిధ విషయాల్లో ఈ రెండు సినిమాల మధ్యన పోటీ నెలకొందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ట్యాగ్ లు, కౌంటర్ ట్యాగ్ లతో ఇరు సినిమాల వాళ్లూ తమ పోటీని ధ్రువీకరించినట్టుగా అయ్యింది.