అమరావతి నుంచి రాజధానిని మార్చే ఉద్దేశం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఉంది. వికేంద్రీకరణ మాత్రమే చేస్తామని స్పష్టం చేస్తోంది. అయితే వికేంద్రీకరణ జరగకూడదని, అమరావతి నుంచినే అంతా సాగాలని తెలుగుదేశం పట్టు పడుతూ ఉంది. ఒక పెయిడ్ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉంది. ఈ ఉద్యమం అంతా రియలెస్టేట్ వ్యాపారుల స్పాన్సర్ షిప్ తోనే నడుస్తూ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అయినా మూడు ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు అయినప్పుడు.. ఒకే ప్రాంతం చెప్పినట్టుగా, ఒకే ప్రాంతం ప్రయోజనాలకు అంతా జరగాలని ఎలా వాదిస్తారో, ఏ మాత్రం ఇంగితం వున్న వాళ్లు అయినా అలా మాట్లాడతారా? అసలు దాన్ని ఉద్యమం అని అంటారా? అనేవి కామన్ సెన్స్ ఏ మాత్రం ఉన్న వాళ్లకు అయినా అర్థం అవుతుంది.
ఆ సంగతలా ఉంటే.. అమరావతి నుంచి రాజధానిని తరలించాలంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనే ఒక చిత్రమైన డిమాండ్ చేస్తూ ఉన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. అలా ఎన్నికలకు వెళ్లి రాజధానిని మార్చుకోవాలని, మళ్లీ ఓడితే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానంటూ కూడా ఆయన ప్రకటించుకున్నారు.
చంద్రబాబు ఆ సవార్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు చేయాల్సింది సవాల్ కాదు, దమ్మూధైర్యం ఉంటే.. ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలి! వెనుకటికి తెలంగాణ ఉద్యమం విషయంలో ఏం జరిగిందో అంతా చూశారు. ప్రత్యేక ఉద్యమం ఒత్తిడి పెంచాడానికి కేసీఆర్ పలు మార్లు రాజీనామా ఎత్తుగడను ఎంచుకున్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ ముఖ్యం అనుకున్నారు. తన ప్రాంతీయ వాదాన్ని వినిపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి ముఖ్యం అంటున్నారు. ప్రభుత్వం మాత్రం మూడు ప్రాంతాలు అంటోంది. అమరావతే ముఖ్యం అని తనతో ప్రజలంతా చెబుతున్నారని చంద్రబాబు నాయుడు ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో.. చంద్రబాబుకు ముందున్న మార్గం రాజీనామాలే.
ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి.. తన పార్టీ ఎమ్మెల్యేలందరితోనూ రాజీనామాలు చేయించి, చంద్రబాబు కూడా రాజీనామా చేయాలి. ఎన్నికలకు వెళ్లి భారీ మెజారిటీలతో విజయాలు సాధించి.. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. రాయలసీమలో ముగ్గురు, కోస్తా-ఉత్తరాంధ్రలో ఉన్న తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఆయా ప్రాంతాల ప్రజలు గెలిపిస్తే.. అప్పుడు ప్రజలు అమరావతికే కట్టుబడినట్టు. ఉత్తుత్తి ఉద్యమాల బదులు చంద్రబాబు నాయుడు దమ్మూధైర్యంతో కూడిన రాజీనామాల రాజకీయం చేస్తే.. అప్పుడు ఆయనలోని సత్తా ఏమిటో బయటపడుతుంది. అలా కాకుండా.. జోలె రాజకీయాలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసుకోవడానికి బాగుంటాయేమో కానీ, అంతకు మించి ఉపయోగం ఉండకపోవచ్చు అని పరిశీలకులు అంటున్నారు.