హీరోయిన్స్ అందరికీ క్రేజ్ రాదు. అందంతో పాటు ఆవగింజంత అదృష్టం ఉన్న ముద్దుగుమ్మలనే స్టార్ డమ్ వరిస్తుంది. ఈ విషయంలో పాయల్ రాజ్ పుత్ దురదృష్టవంతురాలు. ఒంటి నిండా అందం నింపుకున్న ఈ ముద్దుగుమ్మకు క్రేజ్ మాత్రం లేదు. ఇక భవిష్యత్తులో రాదని కూడా తేలిపోయింది. దీంతో పేమెంట్ పై దృష్టి పెట్టింది పాయల్.
అవును.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ సినిమాకైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉంది పాయల్. కథ ఏదైనా, అందులో హీరో ఎవరైనా, దర్శకుడు ఎవరైనా కాల్షీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కోరినంత పారితోషికం ఇచ్చిన నిర్మాతల సినిమాలకు కళ్లుమూసుకొని సంతకం పెట్టేస్తోందట ఈ అందగత్తె.
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది పాయల్. కానీ ఆ క్రేజ్ ను ఆమె సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయింది. కథలు, బ్యానర్ల ఎంపికలో తప్పటడుగులు వేసింది. మంచి పాత్రలు, బడా హీరోల కోసం ఎదురు చూడకుండా ఐటెంసాంగ్స్ చేసింది. ఆ తర్వాత వరుసపెట్టి ఫ్లాపులు కూడా వచ్చాయి. దీంతో ఆమె కెరీర్ డల్ అయింది.
ఇక టాలీవుడ్ లో తన కెరీర్ కష్టమని భావిస్తోంది పాయల్. అందుకే ఉన్నంతలో రెమ్యూనరేషన్ పిండుకోవాలని ఫిక్స్ అయింది. మొహమాటానికి పోయి కాల్షీట్లు ఇవ్వడం లేదు. అటుఇటుగా 40 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తేనే సినిమాకు ఓకే చెబుతోంది.
ప్రస్తుతం ఈమె తెలుగులో కిరాతక అనే చిన్న సినిమా చేస్తోంది. దీంతో పాటు పంజాబీ, కన్నడ, తమిళ పరిశ్రమలపై ఫోకస్ పెట్టింది.