Advertisement

Advertisement


Home > Movies - Movie News

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

అంతా అయిపోయిందనుకుంటే ఇంకా అవ్వకుండా కొనసాగుతున్న ధారావాహిక కార్యక్రమం "మా" గొడవ. 

ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన అభ్యర్థులు కూడా "మా" సభ్యత్వానికి రాజీనామా చెయ్యడానికి ముందుకు రావడం, దానికి సంబంధించిన ప్రెస్మీట్లో వాళ్లకి జరిగిన అవమానాలు చెప్పుకుని ఏడవడం చూస్తుంటే ఏ బిగ్ బాస్ సీజన్ కూడా దీని ముందు నిలబడలేదనిపిస్తోంది. 

బిగ్ బాస్ తో పోల్చడానికి కారణం ఇదొక రియాలిటీ షో. ఇక్కడ ఎమోషన్స్ అన్నీ రియలే. కాకపోతే బిగ్ బాస్ షో 105 రోజుల తర్వాత అయిపోతుంది. "మా" గొడవ ఎప్పుడు ముగుస్తుందో మాత్రం అంతుబట్టడం లేదు. 

ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశాలు కొన్నున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది మోహన్ బాబు అమ్మనాబూతులు తిట్టాడని బెనర్జీ మరియు తనీష్ ఏడవడం, మోహన్ బాబు అలా తిడుతుంటే రక్తం మరుగుతున్నా కేవలం వయసుని దృష్టిలో పెట్టుకుని.. కెరీర్ 20 ఏళ్లు వెనక్కి పోతుందేమోనని భయపడి ఆగానని ప్రభాకర్ అనడం. 

అసలేంటిది? మోహన్ బాబు బూతులు తిట్టిన మాట నిజమే అయితే అది నిజంగా ఖండించవలసిన విషయం. కానీ అలా తిట్టుంచుకున్న బెనర్జీ కనీసం "మైండ్ యువర్ టంగ్ మోహన్ బాబు" అని కూడా అనలేకపోయాడా? అనే ధైర్యం లేకనా? ప్రభాకరుకంటే వయసు అడ్డొచ్చిందన్నాడు..బెనర్జీకి ఏమయింది? పైగా విష్ణు, మనోజ్ వచ్చి వాళ్ల నాన్నగారిని ఏమీ అనొద్దని ఆపారని చెప్పారు బెనర్జీ. 

ఇంత జరుగుతుంటే వీళ్ల పక్షాన కనీసం చిరంజీవైనా ముందుకొచ్చి ఖండించాలి కదా? తాను నిలబెట్టిన ప్యానెల్ కి సంబంధించిన వ్యక్తుల్ని పెదరాయుడు బూతులు తిట్టి వీరంగమాడితే సైలెంట్ గా కూర్చునే వాడు గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రీ ఎందుకవుతాడు? 

పోనీ తన రేంజుకి అది చిన్న విషయం అనుకుంటే కనీసం నాగబాబన్నా మాట్లాడొచ్చుకదా? కోట శ్రీనివాసరావుని నోటికొచ్చిన మాటలు అనగలిగిన నాగబాబుకి మోహన్ బాబుని అనడానికి మాటలు రావట్లేదంటే భయపడుతున్నట్టేగా? 

ఏది ఏమైనా మోహన్ బాబు లోని చెడ్డతనాన్ని, నియంతృత్వ స్వభావాన్ని బట్టబయలు చేసే పని పెట్టుకున్నారు ప్రకాష్ రాజ్ ప్యానల్ వారు. 

కానీ "మా" సభ్యులకి, సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యేది ఏమిటి? వాళ్లు ఎటువైపు మొగ్గుతారు? 

ఉత్తేజ్ తన స్వానుభవంతో చిరంజీవిని ఎంతో మంచివాడిగా పేర్కొన్నాడు. కానీ ఉపయోగం లేదు. మోహన్ బాబుని ఎదుర్కునే బలం చిరంజీవి దగ్గర లేనప్పుడు ఎంత మంచితనమున్నా పనికిరాదు. 

జనం బలవంతుడి వెనుక నిలబడతారు కానీ కేవలం మంచివాడి వెనుక కాదు. 

నాగబాబుని "మెగా ఎరా అయిపోయిందని అనుకోవచ్చా" అని ఒక జర్నలిస్టు అడిగితే "అసలది ఉందని మేమెప్పెడూ అనుకోలేదు అయిపోవడానికి. మాకు పెదరాయుడులాగ కుర్చీలో కూర్చుని తీర్పులు చెప్పే కోరికలు లేవు. మా అన్నయ్యకి ఇగో లేదు. ఎవరొచ్చినా చక్కగా స్వాగతిస్తారు. చేయగలిగినంత సాయం చేస్తారు" అని చెప్పారు. ఇక్కడ కూడా అదే "మంచితనం పాట". 

ఎలక్షనయ్యాక నాగబాబు రాజీనామా చేయడం, ప్రకాష్ రాజ్ రాజీనామా చేయడం, గెలిచిన తన ప్యానల్ మెంబర్స్ కూడా రాజీనామా చేయడం చూస్తుంటే పలాయనవాదంలాగే ఉంది తప్ప తాము చెబుతున్నట్టు "మా" భవితవ్యం కోసం అన్నట్టుగా లేదు. 

ఓటమి వలన వచ్చిన వైరాగ్యంతో ప్రత్యర్థులు చేసిన మాటల గాయాల్ని తలచుకుని ఏడుస్తూ "ఇక సెలవు" అంటూ రాజీనామా చేయడమంటే అది అసలు సిసలైన ఓటమి. 

గెలిచిన అభ్యర్థులు కూడా తమని నమ్మి ఓట్లేసిన సభ్యులని వదిలేసి రాజీనామా చేసి పారిపోవడం ఇకా పెద్ద ఓటమి. 

వీళ్లందరికీ ఏ మాత్రం ఓదార్పునీయకుండా, పోరాటస్ఫూర్తిని నింపకుండా అసలు సీన్లోనే కనపడని "మంచివాడైన" చిరంజీవిది కొలవలేనంత అతి పెద్ద ఓటమి. 

చిరంజీవంత మంచివాడికి బయటి రాజకీయాలే కాదు "మా" రాజకీయాలు కూడా అస్సలు పనికిరావు. 

ఎంత బలం, బలగం ఉన్నా, ఇంట్లో అంతమంది మాస్ హీరోలున్నా ఒక్క "మంచు" దెబ్బకి ఇలా ఫ్రీజ్ అయిపోయారంటే అది కేవలం వాళ్ల వ్యక్తిత్వంలోనూ, రాజకీయనైపుణ్యంలోనూ, నాయకత్వలక్షణాల్లోనూ ఉన్న లోపం మాత్రమే. 

శ్రీనివాస మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?