గతేడాది దీపావళికి రావాల్సిన రజనీకాంత్ సినిమా, ఈ ఏడాది దీపావళికి రెడీ అయింది. నవంబర్ 4న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. పెద్దన్న అనే తెలుగు టైటిల్ ఫిక్స్ చేశారు. తమిళ టీజర్ వచ్చేసింది, తెలుగు టీజర్ రావాల్సి ఉంది.
పెద్దన్న రాకతో ఊహించని విధంగా దీపావళి బాక్సాఫీస్ బరిలో పోటీ పెరిగిపోయింది. ఈసారి దీపావళికి పెద్ద సినిమా లేదనే లోటును పెద్దన్న తీర్చాడు. అయితే అదే సమయంలో వరుడు కావలెను, రొమాంటిక్, మంచి రోజులు వచ్చాయి లాంటి సినిమాలు ఇబ్బంది పడబోతున్నాయి. నాగశౌర్య హీరోగా నటించిన వరుడు కావలెను సినిమాను ఇప్పటికే ఓసారి పోస్ట్ పోన్ చేశారు. నవంబర్ 4న తీసుకురావాలని అనుకుంటున్నారు.
ఇప్పుడు రజనీకాంత్ రాకతో ఆ డేట్ కు కూడా అనుమానాలే. ఇక ఆకాష్ పూరి చేసిన రొమాంటిక్, మారుతి డైరక్ట్ చేసిన మంచి రోజులువచ్చాయి కూడా అదే తేదీకి లాక్ అయి ఉన్నాయి. ఇందులో ఎన్ని తప్పుకుంటాయో, ఎన్ని వస్తాయో చూడాలి.
పెద్దన్న సినిమాను నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి తీసుకున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడం పక్కా అని తేలిపోయింది. అప్పటికి అందుబాటులో ఉన్న మిగతా థియేటర్ల బట్టి ఇతర సినిమాల రిలీజులు ఆధారపడి ఉంటాయి.