పవన్ ముసుగు తొలిగింది. తను కూడా కుల రాజకీయాలు షురూ చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గం వారీగా కులాలు, దానికి ప్రాతినిథ్యం వహించే నేతల జాబితాను సిద్థం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కులాలవారీగా వీలైనంత ఎక్కువ మంది నేతల్ని పార్టీలో చేర్చుకోవాలనేది పవన్ టార్గెట్. దీని కోసం ఇప్పట్నుంచే హోం వర్క్ మొదలుపెట్టారాయన.
కాపులకు మరింత ప్రాధాన్యం
పైకి చెప్పుకోరు కానీ.. మాదాసు గంగాధరం వంటి సీనియర్ కాపు నేతలతో గతంలో తన చుట్టూ కోటరీ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు పవన్. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడిక కుల రాజకీయాలకు సిద్ధమయ్యారు కాబట్టి.. అన్ని జిల్లాల్లోనూ కాపు నాయకులను, కాపు సంఘాల వారినీ చేరదీసేందుకు సిద్ధమయ్యారు.
వారికి తగిన ప్రయారిటీ ఇస్తామని, పార్టీ పదవుల్లో కీలకంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారట. వచ్చే ఎన్నికలనాటికి కాపులందర్నీ ఒకే గూటికిందకు చేర్చడం పవన్ టార్గెట్. అందులో భాగంగానే జిల్లాల వారీగా కాపు సంఘం నాయకుల్ని ఈ వ్యవహారంలో కీలకంగా మారుస్తున్నారని సమాచారం.
రాజుల కోసం వేట..
జనసేన వ్యవస్థాపకుడు కాపు, ఆయన కుడి భుజం కమ్మ. మొన్నటివరకు ఈ సమీకరణలు ఇక్కడితోనే ఆగిపోయాయి. మిగతా వారిలో సీఎం జగన్ సామాజిక వర్గం అంటే పవన్ కు మొదటినుంచీ పడదు. ఒకవేళ అటువైపు నుంచి కీలక నేతలు వచ్చినా పవన్ వారికి ఎలాంటి గౌరవం ఇస్తారో అనే అనుమానం ఉంది. ఇలాంటి టైమ్ లో రాజుల వైపు చూస్తున్నారు పవన్.
రఘురామకృష్ణంరాజుకి సొంత సామాజిక వర్గంలో అంత సీన్ లేదు కానీ, ఆయన ఇప్పుడు పవన్ ని బాగా హైలెట్ చేస్తున్నారు. సో.. అటువైపు నుంచి కూడా వీలైనంత మందిని తనవైపు తిప్పుకోవాలని పవన్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో రాజకీయాలకు దూరంగా ఉన్న క్షత్రియ వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. రాజులకు తగినంత గుర్తింపు తమ పార్టీలో ఉంటుందనే భరోసా ఇస్తున్నారు.
కృష్ణా, వెస్ట్ గోదావరి లో కమ్మల కోసం గాలం..
కమ్మ సామాజికవర్గం వారికి టీడీపీయే గెలవాలని ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. దీంతో కొంతమంది కమ్మ వర్గీయులు, జనసేన వైపు చూస్తున్నారు. అలాంటివాళ్లందర్నీ ఒక తాటిపైకి తీసుకొచ్చే బాధ్యతను మనోహర్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ జిల్లాల నుంచి వీలైనంత ఎక్కువ మంది కమ్మ నేతల్ని జనసేన వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
టీడీపీలో ఆల్రెడీ పాతుకుపోయిన కొంతమంది కమ్మ నేతలకు, ఆ ప్రాంతానికి చెందిన మరికొంతమంది కమ్మ నేతలకు పొసగడం లేదు. ఇలా టీడీపీలో చేరలేకపోతున్న కమ్మ నేతలు కొందర్ని స్వయంగా చంద్రబాబు, జనసేన వైపు పంపిస్తున్నారు.
అతంతృప్తులు ఏ క్యాస్ట్ అయినా ఓకే..?
గతంలో పక్క పార్టీల నుంచి వలసలను పెద్దగా పవన్ పట్టించుకోలేదు, అసంతృప్త నేతలకి కూడా జనసేన ఆల్టర్నేట్ గా కనిపించనూ లేదు. ఈసారి మాత్రం ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడిన వారికి జనసేన తరపున సపోర్ట్ ఇవ్వాలని చూస్తున్నారు పవన్ కల్యాణ్. అలాంటి వారు ఎన్నికలైపోయిన తర్వాత పార్టీతో ఉంటారా ఉండరా అనే విషయాన్ని పక్కనపెడితే.. జనసేన తరపున ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అని లెక్క చెప్పుకోవచ్చు కదా. అదృష్టం బాగుంటే అందరూ తనతోనే ఉంటారనే నమ్మకం కూడా ఉంది.
అందుకే పవన్ ఈసారి అసంతృప్తులపై బాగా ఫోకస్ పెట్టాలనుకుంటున్నారట. అలాంటివారు ఏ కులమైనా చివరి నిమిషంలో జనసేన ఆదరిస్తుంది. ఎన్నికలకు ముందు కూడా.. కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ.. ఇలా ఏ కులానికి చెందిన నేతలైనా, ఏ పార్టీలో ఉన్నా, వాళ్లు అందులో అసంతృప్తిగా ఉంటే, వెంటనే తమ పార్టీ వైపు ఆకర్షించాలని పవన్ నిర్ణయించారు. మొత్తమ్మీద ఏపీలో కులాల కుంపట్లు రాజేస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఎంతమేర లాభపడతారో చూడాలి.