హుజూరాబాద్ లో ఒక్క ఓటు రేటు ఎంతో తెలుసా?

ఒకరిది ఆత్మగౌరవ నినాదం, మరొకరిది ఇజ్జత్ కా సవాల్. దీంతో హుజూరాబాద్ లో ధనప్రవాహం కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోంది. ఏ ఒక్క ఓటును వదలకుండా నేతలు జల్లెడపడుతున్నారు. ఓటు తమకు వేసినా వేయకపోయినా…

ఒకరిది ఆత్మగౌరవ నినాదం, మరొకరిది ఇజ్జత్ కా సవాల్. దీంతో హుజూరాబాద్ లో ధనప్రవాహం కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోంది. ఏ ఒక్క ఓటును వదలకుండా నేతలు జల్లెడపడుతున్నారు. ఓటు తమకు వేసినా వేయకపోయినా విపరీతంగా డబ్బు పంచిపెడుతున్నారు. గతంలో జరిగిన నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నికలను మించి కాస్ట్ లీగా మారిపోయాయి హుజూరాబాద్ ఎన్నికలు.

విభజించెయ్.. ఓట్లు కొనేసెయ్

ఈసారి ఓట్ల కొనుగోలుకు ఒకే వ్యూహాన్ని అనుసరించడం లేదు రాజకీయ పార్టీలు. ప్రాంతాలవారీగా, కులాల వారీగా కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఏదైనా సామాజిక వర్గం ఎక్కువగా ఉంటే, ఆ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లకు ఓ రేటు.. మిగతా సామాజిక వర్గానికి చెందిన ఓటర్లకు మరో రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఎటొచ్చి ప్రతి ఓటరుకు 15వేల రూపాయలకు తగ్గకుండా అందుతోందని టాక్

ఒకే కుటుంబం.. లక్షల్లో ప్యాకేజీ

కులాల వారీగా ఓట్లు కొనుగోలు చేయడంతో పాటు కుటుంబం లెక్కన కూడా గంపగుత్తగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారు నేతలు. ఒక కుటుంబంలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే.. అలాంటి వాళ్లకు 2 లక్షలకు పైగా ఇచ్చేందుకు నేతలు వెనకాడ్డం లేదు. లేదంటే, అంత మొత్తానికి బంగారమో లేక ఇంటికి కావాల్సిన వస్తువులో సమకూర్చి పెడుతున్నారు.

ఒక గ్రామం.. సత్వరమే సమస్య పరిష్కారం

డబ్బులు పంచడం ఒకెత్తయితే, ఆల్రెడీ ఉన్న సమస్యల్ని పరిష్కరించడం మరో ఎత్తు. అన్ని చోట్లా డబ్బుతో పనులు జరగవు. అలాంటి చోట్ల స్థానికంగా ఉన్న సమస్యల్ని గుర్తిస్తున్నారు నేతలు. వాటిని వెంటనే అక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. వాటర్ ట్యాంక్ కట్టించడం, రోడ్లు వేయడం, అదనంగా ఫించన్లు మంజూరు చేయడం, వ్యవసాయ పనిముట్లు సమకూర్చడం, లైబర్రీ హాల్ కట్టించడం లాంటివి చకచకా జరిగిపోతున్నాయి.

ఓవైపు ఇన్ని పనులు చేస్తూనే, మరోవైపు ఓటు వృధా కాకుండా జాగ్రత్తపడుతున్నాయి ఇరు పార్టీలు. ఎలా ఓటు వేయాలి అనే అంశంపై కూడా పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటుకు 10వేలు ఇస్తోందని ఆరోపిస్తున్నారు ఈటల. అటు ఈటల వర్గం ఇంటింటికి గోడ గడియారాలు పంచుతోందని, టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే తెరవెనక మాత్రం అంతకుమించి పంపకాలు జరిగిపోతున్నాయనేది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట.

ఓవైపు కోట్ల రూపాయల డబ్బును పోలీసులు సీజ్ చేస్తున్నప్పటికీ, మరోవైపు పంపకాలు మాత్రం జోరుగా సాగిపోతున్నాయి. పట్టుబడిన డబ్బు కేవలం ఒక శాతం మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.