ప్రముఖ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్ నిర్ణయాలు భలే చిత్రంగా ఉంటాయి. సినీరంగంలో పవన్‌కల్యాణ్ అంటే తనకు దేవుడని, ఆయన కోసం ప్రాణమైనా ఇస్తానని పలు వేదికల నుంచి బండ్ల గణేష్ ప్రకటించి అభిమానాన్ని చాటుకున్నారు. అలాంటి బండ్లకు ఒక్క విషయంలో మాత్రం జనసేనాని పవన్‌కల్యాణ్‌పై నమ్మకం లేనట్టుంది. రాజకీయాల్లో పవన్ భవిష్యత్‌పై బండ్లకు నమ్మకం లేదని మరోసారి రుజువైంది.
తాను కాంగ్రెస్‌లోకి వెళ్లడానికి సిద్ధపడుతున్నారే తప్ప, తన ఆరాధ్య దైవం స్థాపించిన జనసేనలోకి మాత్రం ఆయన వెళ్లడానికి ఆసక్తి కనబరచకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీలో అడుగు ముందుకేస్తానని బండ్ల గణేష్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొనాలని బండ్ల గణేష్‌ను మాజీ ఎంపీ మల్లు రవి కోరారు. రేవంతన్న ఆదేశిస్తే రెడీ అని ఆయన గ్రీస్ సిగ్నల్ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి , మల్లురవి, బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాలపై వాళ్ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.
ఇందులో భాగంగా కాంగ్రెస్‌లో మళ్లీ యాక్టీవ్ కావడానికి బండ్ల గణేష్ ఆసక్తి చూపడం చర్చనీయాంశమైంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లో బండ్ల గణేష్ చేరారు.
కాంగ్రెస్ నాయకుడిగా బండ్ల గణేష్ మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తూ సృష్టించిన కామెడీని జనం ఇప్పటికీ మరిచిపోలేకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం లేకపోతే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని బండ్ల చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.
కాంగ్రెస్ ఓటమితో రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు బండ్లలో నూతన ఉత్తేజాన్ని నింపింది. మరి పవన్‌కల్యాణ్ ఆ పని చేయలేక పోయారా?