పీపుల్స్ మీడియా రిస్క్ ఎందుకు చేస్తున్నట్లు?

టాలీవుడ్ లో ఫార్వార్డ్ స్టెప్ వేసి మరీ బ్యాటింగ్ చేస్తోంది పీపుల్స్ మీడియా సంస్థ. ఆ సంస్థ నుంచి ఏ అప్ డేట్ వచ్చినా జనాల కనుబొమ్మలు కాస్త ముడిపడుతున్నాయి. తమిళ సినిమా వినోదయసితం…

టాలీవుడ్ లో ఫార్వార్డ్ స్టెప్ వేసి మరీ బ్యాటింగ్ చేస్తోంది పీపుల్స్ మీడియా సంస్థ. ఆ సంస్థ నుంచి ఏ అప్ డేట్ వచ్చినా జనాల కనుబొమ్మలు కాస్త ముడిపడుతున్నాయి. తమిళ సినిమా వినోదయసితం రీమేక్ అన్నప్పుడు ఇలాగే జరిగింది. పవన్ కళ్యాణ్-సాయిధరమ్ తేజ్, సముద్రఖని-త్రివిక్రమ్ ఇలా అందరికీ పారితోషికాలు ఇచ్చుకుంటూ, భారీగా తీస్తే ఆ సబ్జెక్ట్ లో ఏం కిడుతుందనే వార్తలు గట్టిగా వినిపించాయి. సరే సినిమా విడుదల దగ్గరకు వస్తోంది కనుక వెయిట్ చేస్తే తెలుస్తుంది.

డివివి దానయ్య ఎందుకు వదిలేసారో తెలియదు. మారుతి-ప్రభాస్ సినిమాను వదిలేసారు. కొంత మంది నిర్మాతల దగ్గరకు వెళ్లింది. కానీ ఎవరూ టేకోవర్ చేయలేదు. పీపుల్స్ మీడియా డేరింగ్ స్టెప్ వేసి 45 కోట్ల సింగిల్ పేమెంట్ ఇచ్చి టేకోవర్ చేసింది. అందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ వరకు ఓకె . మారుతి కదా డైరక్టర్..ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా అని. ఫ్యాన్స్ అయితే గోల గోల చేసారు. ఆఖరికి ఇప్పుడు నెమ్మదించారు. సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆసక్తి కనబరుస్తున్నారు.

కార్తికేయ2, ధమాకా హిట్ లు చూసి అహో అన్నవారే, రామబాణం చూసి పీపుల్స్ మీడియాకు జాగ్రత్తలు చెప్పడం మొదలు పెట్టారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జిఎస్టీతో కలిపి 185 కోట్ల మేరకు చెల్లించి ఆదిపురుష్ రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు తీసుకోవడం తెలిసి షాక్ అవుతున్నారు. పీపుల్స్ మీడియాకు పిచ్చి పట్టిందా అనేంత సీరియస్ కామెంట్లు ఆఫ్ ది రికార్డులో వినిపిస్తున్నారు.

దగ్గర దగ్గర 300 కోట్లు గ్రాస్ వసూళ్లు రావాల్సి వుంటుంది తెలుగు రాష్ట్రాల్లో కొన్న డబ్బులు రావాలంటే.ఇదేమీ చిన్న విషయం కాదు. పైగా ఆదిపురుష్ ఏమీ కమర్షియల్ రెగ్యులర్ సినిమా కాదు. రిపీట్ ఆడియన్స్ రావడానికి. ఇప్పుడు ఆదిపురుష్ ను ఏ రేంజ్ లో మార్కెట్ చేస్తారు అన్నది క్వశ్చను. నైజాం ను 70 కోట్లకు పైగా రేంజ్ లో మార్కెట్ చేయాలి. ఆంధ్రకు కనీసం 80 కోట్ల రేంజ్ లో మార్కెట్ చేయాలి. అలా చేస్తేనే ముందుగా రికవరీ వుంటుంది. విడుదల తరువాత సంగతి వేరే.

ఇప్పుడు ఈ రేంజ్ లో అడ్వాన్స్ ఇవ్వడానికి ఎగ్జిబిటర్లు ముందుకు రావాల్సి వుంటుంది. పీపుల్స్ మీడియా మీద నమ్మకం, లైన్ లో సినిమాలు వున్నాయి. అంత వరకు ఓకె. కానీ కొనే డిస్ట్రిబ్యూటర్ల సంగతి కూడా చూడాల్సి వుంది. ముఖ్యంగా నైజాంలో కాస్త తక్కువ మంది బయ్యర్లు వున్న చోటు ఈ రేంజ్ మొత్తం రప్పించాలి అంటే కాస్త గట్టి ఎక్సర్ సైజ్ చేయాల్సిందే.

ఇవన్నీ పీపుల్స్ మీడియాకు తెలియనివి కావు. ఇందులో ఏ మేరకు రిస్క్ వుంటుందో లెక్కలు కట్టలేని సంస్థ కాదు. కానీ తెలిసీ ఎందుకు రిస్క్ చేస్తోంది అన్నదే ప్రశ్న. టీ సిరీస్ కాంబినేషన్ లో సందీప్ వంగా తో చేయబోయే ప్రాజెక్టు ను దీంతో ముడివేసి తీసుకున్నారు. ఇక్కడ తగ్గేది అక్కడ కవర్ అవుతుంది అనే ఆలోచన చేస్తున్నారేమో అని అనుకోవచ్చు.

కానీ అది కూడా గాలిలో ఎగిరే పిట్టకు మసాలా నూరడం లాంటిదే. ఎందుకంటే స్పిరిట్ కన్నా ముందు సందీప్ వంగా ఏనిమల్ సినిమా వుంది. దాని లెక్కలు తేలిన తరువాత స్పిరిట్ లెక్కలు వుంటాయి. సందీప్ వంగా తీసింది ఇప్పటి అర్జున్ రెడ్డి ఒక్కటే రెండు భాషల్లో కలిపి. రెండో సినిమా వస్తే తప్ప క్లారిటీ రాదు.

యువి సంస్థ గత కొన్నాళ్లుగా కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. గుట్టుగా పరిస్థితిని నెట్టుకువస్తోంది. ఆదిపురుష్ సినిమాను నేరుగా విడుదల చేయడం అన్నది అంత సులువు కాదు. చాలా చిక్కుముడులు వున్నాయి. ఇప్పుడు ఇలా విడుదల వ్యాపారం మొత్తం బదిలీ చేయడం ద్వారా యువి అధినేతలు పూర్తిగా ఊపిరి పీల్చుకుంటారు. వారి వరకు చాలా అదృష్టవంతులే. పైగా ఏనిమల్ లాంటి భారీ సినిమాల జోలికిపోకుండా, ఎంతో కొంత గుడ్ విల్ కు ఇచ్చేయడం కూడా వారికి కలిసి వచ్చే అంశమే.

కానీ ఈ మొత్తం వైనంలో పీపుల్స్ మీడియా స్ట్రాటజీ ఏమిటి? రిస్క్ ఫ్యాక్టర్ ఎంత? ఇవన్నీ ఇప్పుడు టాలీవుడ్ లో బాగా డిస్కషన్లకు తావిచ్చాయి.