ఎన్టీఆర్ భీమిలీ మోజు

ఎన్టీఆర్ రాజకీయాల్లో పదమూడేళ్ళు మాత్రమే ఉన్నారు. నాలుగు సార్లు సీఎం గా ఆయన ప్రమాణం చేశారు. ఎనిమిదేళ్ళ పాటు పనిచేశారు. ఎన్టీఆర్ 1983 నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ రెండు మూడు అసెంబ్లీ  సీట్లలో పోటీ…

ఎన్టీఆర్ రాజకీయాల్లో పదమూడేళ్ళు మాత్రమే ఉన్నారు. నాలుగు సార్లు సీఎం గా ఆయన ప్రమాణం చేశారు. ఎనిమిదేళ్ళ పాటు పనిచేశారు. ఎన్టీఆర్ 1983 నుంచి ప్రతీ ఎన్నికల్లోనూ రెండు మూడు అసెంబ్లీ  సీట్లలో పోటీ చేస్తూ వచ్చారు. ఆయన ఓడిపోతారని కాదు, అన్ని ప్రాంతాలు తనకు సమానం అని చెప్పడానికే అలా ఎంచుకున్నారు. తన రాజకీయ జీవితంలో చివరిసారిగా ఎన్టీఆర్ 1994 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు. హిందూపురంతో పాటుగా రెండవ సీటుగా ఉత్తరాంధ్రాలో ఏదో ఒక దానిలో పోటీ చేయాలని ఆరాటపడ్డారు.

అప్పట్లో భీమునిపట్నం నుంచి పోటీ చేయాలని ఎన్టీఆర్ చాలా ముచ్చట పడ్డారు. దాంతో భీమిలీ నుంచి రెండు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి చివరి నిముషం వరకూ భీ ఫారం కూడా ఇవ్వలేదు. భీమిలీ నుంచి పోటీ ఖాయమని అంతా అనుకున్న టైం లో ఏం జరిగిందో ఏమో అన్న గారి గాలి కాస్తా శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైపుగా వెళ్ళింది.

ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేయాలని లాస్ట్ మినిట్ తో డెసిషన్ మార్చుకోవడంతో భీమిలీ ఎమ్మెల్యే  సీఎం అయ్యే చాన్స్ తప్పిపోయింది. ఎన్టీఆర్ విశాఖ మీద భీమిలీ మీద సీఎం గా ఉన్నపుడు చాలా మక్కువ చూపేవారు.

భీమిలీలో అనేక కార్యక్రమాలకు కూడా ఆయన హాజరై విశాఖ సరిసాటి ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆయన భీమిలీ నుంచి గెలిచి ఉంటే ఈ అందమైన పట్టణం దశ మరో విధంగా ఉండేదని ఆ ప్రాంత వాసులు నాటి ముచ్చట్లను ఆయన నూరవ పుట్టిన రోజున నెమరువేసుకుంటున్నారు.