Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

‘పిచ్’ మారుతోంది ఎందుకని?

‘పిచ్’ మారుతోంది ఎందుకని?

ఎటు చూసినా కూటమి మాటలు వినిపిస్తూ వచ్చాయి నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడెందుకు గ్రౌండ్‌ పిచ్ మారుతోంది వైకాపాకు అనుకూలంగా అనే వార్తలు వినిపిస్తున్నాయి. జనసేన- తేదేపా- భాజపా కూటమి కట్టిన కొత్తలో బలం అటు కనిపించింది. వార్తలు అటు వినిపించాయి. సోషల్ మీడియా గోల సరేసరి. కానీ ఇప్పుడెందుకు, నామినేషన్ల పర్వం తరువాత మళ్లీ పిచ్ మారుతోంది అనే మాటలు వినిపిస్తున్నాయి. చూద్దాం.. ఎలా వుంటుందో అనే మాటలు కూటమి అనుకూల వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.

ఎందుకంటే వాస్తవాలు తెలిసి వస్తున్నాయి కనుక. కూటమి పేరు చెప్పి, చంద్రబాబు తెలివిగా పవన్, కమలాన్ని బుట్టలో వేసుకున్నారనే క్లారిటీ వస్తోంది. జెండా ఏదైనా, కండువా ఏదైనా అభ్యర్ధి మాత్రం తేదేపా నుంచి వెళ్లిన వాళ్లే కావడం అన్నది ఇప్పుడిప్పుడే జనాలకు క్లారిటీ వస్తోంది. కాపులకు అండగా వుంటుందనుకున్న భాజపా, పురంధేశ్వ‌రి నాయకత్వంలో కమ్మవారితో నిండిపోతోందనే లెక్కలు పక్కాగా బయటకు రావడం మరో కారణం.

ఇంక‌ మరో చిత్రమైన కారణం ఒకటి వుంది. సాధారణంగా ఫ్యాన్స్ అంటే ఒకే గ్రూప్ గా వుండరు. ఒక ఊరిలో బోలెడు ఫ్యాన్స్ గ్రూపులు వుంటాయి. ఒకళ్లకి వేరొకళ్లకి సరిపడదు. అదో చిత్రమైన వ్యవహారం. అంతా అదే హీరో అభిమానులే. కానీ ఎవరి దారి వారిది. ఇలాంటి నేపథ్యంలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థికి కాస్త చరుగ్గా వున్న గ్రూప్ దగ్గరవుతోంది. మిగిలిన గ్రూపులు అలిగి దూరంగా వుంటున్నాయి. ఇలాంటి వాళ్లను వైకాపా టార్గెట్ చేసి దగ్గరకు తీస్తోంది. ఇదో తంతు.

పథకాల విషయంలో జనాలు కాస్త పునరాలోచనలో పడిన మాట వాస్తవం. చంద్రబాబు వస్తే ఈ పథకాలు వుంటాయా? వుండవా? అన్నది ఒకటి. అలాగే ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణం అన్నది కూడా ఏమైనా ఇబ్బందుల్లో పడుతుందా అనేది మరొకటి. ఇవన్నీ కూడా కాస్త నెగిటివ్ ట్రెండ్ కు దారితీస్తున్నాయి కూటమి విషయంలో.

అయితే ఇంకా అప్పుడే అంతా అయిపోలేదు. కూటమి మేనిఫెస్టో వస్తోంది. ఆపై వైకాపా మాని ఫెస్టో వస్తుంది. అప్పుడు జనాల మనోగతం ఎలా మారుతుందో చూడాల్సి వుంది. ఇప్పటికైతే పైకి ఎన్ని బింకాలు పోయినా, కూటమి అభిమానులు, ప్రభుత్వం వస్తుందంటారా? ఏమో కాస్త అనుమానంగానే వుంది. మళ్లీ జగన్ నే వస్తాడేమో? అనే మాటలు మాట్లాడడం కాస్త ఆశ్చర్యంగానే వుంది.

ఈ విషయంలో తొలివారానికి మరింత క్లారిటీ వస్తుంది. ఒక వేళ పిచ్ నిజంగానే వైకాపాకు అనుకూలంగా మారితే అది కూడా క్లారిటీ వస్తుంది. ఎలా అంటే కింది స్థాయి నాయకులు భవిష్యత్ మీద ముందు జాగ్రత్తతో సర్దు కోవడం మొదలుపెడతారు. ఆ సర్దుకోవడం ఎటు వుంటే అదే ఇండికేషన్. ఇప్పుడు ఈ సర్దుబాటు కింది స్థాయిలో వైకాపాకు అనుకూలంగా జరుగుతున్నాయి. అదంతా డబ్బుల మహిమ అని ప్రస్తుతానికి అనుకోవచ్చు. కానీ మే మొదటి వారంలో జరిగేవి మాత్రం డబ్బులతో కాదు, మొగ్గును బట్టి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?