కేపీ చౌదరి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పుడే టాలీవుడ్ లో కొందరికి గుబులు పట్టుకుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. ఎప్పుడైతే కేపీ చౌదరిని పోలీసులు 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారో, అప్పుడిక చాలామంది తమ పనైపోయిందని భావించారు.
అందరి అనుమానాలు నిజం చేస్తూ, డ్రగ్స్ 'సరఫరాదారు' కేపీ చౌదరి కాల్ లిస్ట్ నుంచి 12 మంది నటీనటుల కాంటాక్టులు వెలికితీశారు పోలీసులు. ఆ కాల్ లిస్ట్ లో ఓ హీరోయిన్, ఐటెంసాంగ్ చేసిన మరో హీరోయిన్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. వీళ్లిద్దరితో కొన్ని వందల సార్లు కేపీ చౌదరి ఫోన్ లో మాట్లాడాడు.
ఇదే విషయంపై పోలీసులు ప్రశ్నిస్తే, అడ్డదిడ్డంగా సమాధానాలిచ్చాడట కేపీ చౌదరి. తను ఒక నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నని, నటీనటులతో తరచుగా మాట్లాడితే తప్పేంటని రివర్స్ లో పోలీసుల్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
మరోవైపు తను డ్రగ్స్ తీసుకుంటున్న విషయాన్ని అంగీకరించాడు కేపీ చౌదరి. పట్టుబడిన డ్రగ్స్ అన్నీ తను వాడడం కోసమే గోవా నుంచి తెచ్చుకున్నానని, టాలీవుడ్ లో ఎవ్వరికీ తను సరఫరా చేయడం లేదని చెప్పుకొచ్చాడు. మరి పట్టుబడినప్పుడు మిస్సయిన 2 ప్యాకెట్లు ఎక్కడున్నాయనే ప్రశ్నకు మాత్రం చౌదరి నుంచి సమాధానం లేదు.
మరోవైపు కేపీ చౌదరి ఎకౌంట్ లో అనుమానాస్పదంగా ఉన్న 11 ట్రాన్సాక్షన్లను గుర్తించారు పోలీసులు. వాటిపై కూడా ప్రశ్నలు గుప్పించారు. వీటికి కూడా సగం సగం సమాధానాలిచ్చాడట చౌదరి.
మొత్తమ్మీద కేపీ చౌదరి 2 రోజుల కస్టడీ ముగిసింది. తిరిగి అతడ్ని చర్లపల్లి జైలుకు తరలించారు. పూర్తిస్థాయిలో ఆధారాలు కోర్టుకు సమర్పించి, మరోసారి కేపీ చౌదరిని పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. దీంతో పాటు చౌదరి కాల్ లిస్ట్ లో ఉన్న నటీనటులకు సమన్లు జారీ చేసే అంశాన్ని కూడా సీరియస్ గా పరిశీలిస్తున్నారు.