తన వీరాభిమానిని స్టార్ హీరో ఇలా చంపాడు!

కన్నడ నటుడు దర్శన్ వీరాభిమాని రేణుకా స్వామి హత్యకు సంబంధించిన చిక్కుముడులన్నింటినీ పోలీసులు ఛేదించారు. ఈ కేసు నటుడు దర్శన్ మెడకు గట్టిగా చుట్టుకుంది. ఈ మేరకు బలమైన సాక్ష్యాలు సేకరించారు. హత్య ఎలా…

కన్నడ నటుడు దర్శన్ వీరాభిమాని రేణుకా స్వామి హత్యకు సంబంధించిన చిక్కుముడులన్నింటినీ పోలీసులు ఛేదించారు. ఈ కేసు నటుడు దర్శన్ మెడకు గట్టిగా చుట్టుకుంది. ఈ మేరకు బలమైన సాక్ష్యాలు సేకరించారు. హత్య ఎలా జరిగిందనే విషయాన్ని మొత్తం నమోదు చేశారు.

దర్శన్ ప్రేయసి పవిత్రను రేణుక స్వామి వేధించడంతో ఈ కేసుకు బీజం పడింది. అసభ్యకరమైన వ్యాఖ్యలు, పోస్టులతో పవిత్రను వేధించాడు రేణుకాస్వామి. దీంతో పవిత్ర వెళ్లి తన ప్రియుడు దర్శన్ దగ్గర మొరపెట్టుకుంది. దీంతో దర్శన్ రంగంలోకి దిగాడు.

రేణుకాస్వామి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకునేందుకు చిత్రదుర్గలోని తన అభిమానసంఘం కన్వీనరు రాఘవేంద్ర అలియాస్ రఘును పురమాయించాడు దర్శన్. రేణుకాస్వామి ఎప్పుడు ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడనే విషయాల్ని రఘు, తన అభిమాన హీరోకు పూసగుచ్చినట్టు వెల్లడించాడు.

మొత్తం సమాచారం అందుకున్న దర్శన్, తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి మిగతా పని అప్పగించాడు. వాళ్లు అదను చూసి రేణుకాస్వామిని కిడ్నాప్ చేశారు. భర్త ఇంకా రాలేదని కంగారుపడుతున్న భార్యను కన్వీనర్ రఘు ఓదార్చాడు. పోలీసుల దగ్గరకు వెళ్లొద్దని ఆపాడు.

అటు రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు అతడ్ని బెంగళూరు కామాక్షిపాళ్యలోని ఓ షెడ్డుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత దర్శన్ ఆ షెడ్డుకు వెళ్లాడు. స్వయంగా తన బెల్ట్ తీసి కసితీరా రేణుకాస్వామిని కొట్టాడు. ఆ తర్వాత సహాయకులు కూడా తలో కర్రతో రేణుకాస్వామిని సొమ్మసిల్లిపోయేలా గోడకేసి కొట్టారు. అతడి శరీరంలో చాలా ఎముకులు విరిగిపోయాయి.

ఆ తర్వాత కొద్దిసేపటికే అతడు మరణించాడు. అప్పటికే దర్శన్, అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. నేరుగా మైసూర్ లోని తన ఫామ్ హౌజ్ కు చేరుకున్నాడు. అయితే మృతదేహాన్ని మాయంచేయడం సహాయకుల వల్లకాలేదు. వాళ్లు దాన్ని సమీపంలోని మురుగుకాల్వలో పడేశారు. ఫుడ్ డెలివరీ బాయ్ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే ఆ డెడ్ బాడీని కుక్కలు పీక్కుతిన్నాయి.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ముందుగా రేణుకాస్వామి భార్య నుంచి విచారణ మొదలుపెట్టారు. ఆమె రఘు పేరు వెల్లడించింది. అక్కడ్నుంచి తీగలాగితే డొంక కదిలింది. ఎప్పుడైతే విచారణ మొదలైందో ఆ వెంటనే దర్శన్ అప్రమత్తమయ్యాడు. కేసులో తన పేరు చెప్పొద్దని నిందితులు నలుగురికి డబ్బు ఆశచూపాడు. ముందుగా చెరో 5 లక్షలిచ్చాడు. తర్వాత మరో 5 లక్షలివ్వడానికి ఒప్పందం. మొత్తంగా 40 లక్షలన్నమాట.

కానీ పోలీసుల విచారణ ముందు ఇవేవీ నిలబడలేదు. తమదైన శైలిలో ప్రశ్నించేసరికి దర్శన్ పేరు బయటపెట్టారు. అంతేకాదు, ఫోన్ కాల్స్, వాట్సాప్ ఛాట్స్ కూడా బయటపడ్డాయి. ఈ కేసులో ఏ-1గా పవిత్రను, ఏ-2గా దర్శన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. వీళ్లతో కలిపి మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్టు తెలిపారు.

కేసు మొత్తాన్ని క్లియర్ గా ఛేదించిన పోలీసులు, దర్శన్-పవిత్ర వాంగ్మూలాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే వాళ్లు విచారణకు సహకరించడం లేదంట.