చంద్రబాబు ఇచ్చిన ఉచిత హామీ ఏపీలో ఆటో డ్రైవర్ల ఉపాధి మీద గట్టి దెబ్బ కొట్టబోతోంది. ఆల్రెడీ ఈ ప్రయోగం తెలంగాణలో వికటించిందని తెలిసినా కూడా ఏపీలో ఓట్ల కోసం చంద్రబాబు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు కూటమి గెలిచి హామీ అమలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఆ హామీ కనుక రోడ్డెక్కితే ఆటో డ్రైవర్లు రోడ్డున పడాల్సి వస్తుంది.
పెరుగుతున్న డీజిల్ రేట్లతో ఆటో డ్రైవర్ల ఉపాధి అంతంతమాత్రంగానే ఉంటోంది. ఈ దశలో ఇప్పుడు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటే ఇక ఆటోలు ఎక్కేందుకు వారు ఏమాత్రం ఇష్టపడరు. కాస్త ఆలస్యమైనా, రద్దీగా ఉన్నా కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. ఆడవాళ్లను బస్సు ఎక్కించి, వారికి తోడుగా ఉండాల్సిన మగవారు మాత్రం ఆటోల్లో ఎందుకు వెళ్తారు చెప్పండి.
అంటే.. ఆడవారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కష్టమో నష్టమో బస్సే ఎక్కుతారు. అంటే ఇక్కడ ఆటోలు ఎక్కేందుకు ఆడ, మగ అందరూ కరువైపోతారన్నమాట. తెలంగాణలో ఇదే జరుగుతోంది. ఏపీలో ఈ పథకం అమలులోకి వస్తే ఆటో డ్రైవర్లకు కష్టకాలం మొదలైనట్టే.
తెలంగాణలో ఈ పథకం అమలుతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు, మరికొందరు ఆ ప్రయత్నం చేసి చావు అంచుల వరకూ వెళ్లొచ్చారు, ఇంకొందరు కోపంలో ఆటోలు తగలబెట్టుకున్నారు. అప్పులు చేసి వాయిదాల పద్ధతిలో ఆటోలు కొన్నవారు.. గిరాకీలు లేక కష్టాలు పడుతున్నారు. ఆటో అప్పు కట్టలేక, మరో ఉపాధి మార్గం వెతుక్కోలేక అవస్థలు పడుతున్నారు. ఏపీలో కూడా ఇదే సమస్య, ఇలాగే మొదలు కాబోతోంది.
జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర అమలైంది. ఏడాదికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందించేవారు. తిరిగి అధికారంలోకి వస్తే లారీలు, ట్రక్కుల డ్రైవర్లకు కూడా ఈ పథకం అమలు చేస్తానని మాటిచ్చారు జగన్. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలకు వరమే అయినా, ఆటో డ్రైవర్లకు మాత్రం అది చంద్రబాబు ఇచ్చిన శాపం. ఈ సమస్యకు చంద్రబాబు సర్కారు మధ్యేమార్గంగా ఓ పరిష్కారం ఆలోచించి, అప్పుడు పథకాన్ని అమలు చేస్తే మంచిది.