వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో జనం చెంతకు వెళ్లనున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నింపింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదలుకుని, ఆ పార్టీ కార్యకర్తల వరకూ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ, అక్కడక్కడ జనసేన ఇష్టానురీతిలో భౌతికదాడులకు తెగబడుతోంది. దీంతో కొన్ని వూళ్లలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఇళ్లను వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.
దీంతో వైసీపీ శ్రేణుల్లో భరోసా నింపడానికి స్వయంగా వెళ్లాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇవాళ ఎమ్మెల్సీలతో నిర్వహించిన సమావేశంలో జగన్ కీలక కామెంట్స్ చేశారు. మళ్లీ వైసీపీ ఉవ్వెత్తున ఎగిసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. అందరూ ధైర్యంగా వుండాలన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని జగన్ చెప్పారు. టీడీపీ చేతుల్లో దెబ్బతిన్న కుటుంబాల్ని పరామర్శిస్తానన్నారు.
మనపై కేసులు పడొచ్చన్నారు. అయినప్పటికీ ధైర్యంతో ఎదుర్కోవాలని ఆయన కోరారు. ప్రస్తుతం టీడీపీ, జనసేన , బీజేపీల హనీమూన్ నడుస్తోందన్నారు. కూటమి హామీలను అమలు చేయడానికి కొంత సమయం ఇద్దామన్నారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు తప్పుల్ని లెక్కిద్దామన్నారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేద్దామన్నారు.
అధికారంలో ఉన్నంత వరకూ జగన్ ఎవరినీ కలవకపోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి ఉన్నాయి. అధికారం పోవడంతో మళ్లీ జనం దగ్గరికి జగన్ వెళ్లక తప్పలేదు. అయితే తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని టీడీపీ తీవ్రంగా చిత్రహింసలు పెట్టడంతో జగన్ స్పందించారు. జగన్‌ను వైసీపీ కేడర్‌కు దగ్గర చేస్తున్న ఘనత టీడీపీదే.