కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పాలునీళ్లలా కలిసిపోయాయి. ఆ మూడు పార్టీల నేతలు ప్రస్తుతానికి చాలా ప్రేమగా వుంటున్నారు. కేంద్రంలో బీజేపీకి టీడీపీ ఎంపీల అవసరం చాలా వుంది. దీంతో టీడీపీని కంటికి రెప్పలా బీజేపీ చూసుకుంటోంది. పదవుల విషయంలో చాలా లిబరల్గా వుంటున్నట్టుగా బీజేపీ తన మార్క్ రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తోంది.
ఈ నేపథ్యంలో టీడీపీకి బీజేపీ మరో ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. టీడీపీ చెప్పిన నాయకుడికి గవర్నర్ పదవి ఇవ్వడానికి కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ముందుకొచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగా టీడీపీ సీనియర్ నాయకులు అశోక్‌గజపతి రాజు, యనమల రామకృష్ణుడులలో ఎవరో ఒకరిని గవర్నర్‌గా పంపే అవకాశాలున్నాయని తెలిసింది.
ఈ దఫా కేబినెట్లో యనమలకు చోటు లేకపోవడంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. యనమల కుమార్తె దివ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమెకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో యనమలకు ఏదో ఒక పదవి ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. అలాగే కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన కుమార్తె అదితి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమెకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో టీడీపీకి గవర్నర్ పదవి తెరపైకి వచ్చింది. టీడీపీ సీనియర్ నేతల్లో ఎవరో ఒకరికి ఆ పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తద్వారా బీజేపీతో అనుబంధాన్ని మరింత దృఢతరం చేసుకోడానికి చంద్రబాబు ప్రయత్నిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.